గ్రేడ్–1 మున్సిపాలిటీ లక్ష్యంగా కొత్త మాస్టర్ ప్లాన్
సీసీ రోడ్లు.. డ్రైనేజీలు.. స్ట్రీట్ లైట్లు.. పార్కులతో మారనున్న పట్టణ ముఖచిత్రం
ఆత్మకూరు, సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి ): ఆత్మకూరు పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి గ్రేడ్–1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.2 కోట్లు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.28 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, పార్కుల అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించి అభివృద్ధి పనులకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు.వినాయక చవితి ఉత్సవాల అనంతరం పట్టణ నడిబొడ్డున ప్రత్యేక సమావేశం నిర్వహించి, రాజకీయాలకు అతీతంగా ప్రజలు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆత్మకూరు అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తామని స్పష్టం చేశారు.స్థానికంగా ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు, అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ, క్రీడా శాఖ, మున్సిపల్ అధికారులు, ఇంజనీర్లు, కన్సల్టెన్సీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


