చంద్రగిరి, ఆగష్టు 19, పున్నమి ప్రతినిధి
తొండవాడ అగస్త్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఉదయం 3:30 గంటలకు గోశాల నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డి వేద పండితుల సమక్షంలో నిర్వహించారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు అన్నదాన భవన నిర్మాణానికి వేద పండితుల ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం ఉదయం 10 గంటల నుంచి శ్రీ అగస్త్య మహాముని–లోపముద్ర దేవి ఆలయంలో మండల పూజా కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డితో పాటు తొండవాడ గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయంలో గోశాల, అన్నదాన భవన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం కావడం పట్ల భక్తులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.



