✍️జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యవేక్షణలో సహాయక చర్యలు
✍️భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులతో సమన్వయంతో విస్తృత గాలింపు
అమలాపురం,పున్నమి దినపత్రిక:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక, గాలింపు చర్యలను కొనసాగిస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బుధవారం అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలోని ఫిషరింగ్ ల్యాండ్ సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, స్థానిక శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు, ముమ్మిడివరం స్థానిక శాసనసభ్యులు దాట్ల బుచ్చిరాజు, మత్స్యశాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్ లతో కలిసి ఆయన క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షిస్తూ, గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కింజరాపు అచ్చేన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గల్లంతయిన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు భరోసా కల్పించే దిశగా పనిచేయాలని మంత్రి కోరారు. అదేవిధంగా రాష్ట్ర మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం, పోలీస్, మెరైన్ విభాగాలు భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని తెలిపారు. ఆగస్టు 3వ తేదీన ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ఐఎన్ డి -ఏపి – ఈ8-ఎమ్ -ఎమ్ఓ-135 (ముత్యాలమ్మ బోటు)లో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. కోపనాతి రామకృష్ణ, కొల్లాటి యేసుదాసు, పాలేపు సంతోషరావు, కర్రి రాంబాబు, కొల్లాటి శ్రీనుబాబు, సంగడి తాతారావు, పోనాడి సతీష్‌లు ఈ బోటులో ఉన్నారు. వీరంతా అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలకు చెందినవారని బాదిత కుటుంబాలు మంత్రికి తెలియజేశారు. సాధారణంగా పది రోజుల్లో తిరిగి వస్తామని కుటుంబ సభ్యులకు తెలిపి సముద్రంలోకి వెళ్లినప్పటికీ, నిర్ణీత గడువు దాటిన తరువాత కూడా బోటు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 17న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ డా.ఆర్ మహేష్ కుమార్ వెంటనే స్పందించి గాలింపు చర్యలను ప్రారంభించారని బాధితులు తెలియజేశారు. 300 నాటికల్ మైళ్ల పరిధిలో విస్తృత గాలింపు చేస్తున్నారు. అలాగే గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్‌కు చెందిన 5 నౌకలు, భారత నౌకాదళానికి చెందిన 2 నౌకలు, అలాగే నేవీకి చెందిన 2 అత్యాధునిక విమానాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. సుమారు 300 నాటికల్ మైళ్ల పరిధిలో సముద్ర ప్రాంతాన్ని జల్లెడ పడుతూ బోటు, మత్స్యకారుల ఆచూకీ కోసం నిరంతరంగా శోధన కొనసాగుతోందని మంత్రి అచ్చేన్నాయుడు భరోసా ఇచ్చారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం తదితర తీర ప్రాంతాల రక్షణ విభాగాలకు సమాచారం అందించి సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. సముద్ర ప్రవాహాలు, వాతావరణ పరిస్థితులు, బోటు ప్రయాణించే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని గాలింపు పరిధిని విస్తరిస్తున్నారని తెలిపారు.
మరోవైపు పారాదీప్ సమీపంలో బోటు గుర్తింపు
తాజాగా ఒడిశాలోని పారాదీప్‌కు సుమారు 15 నాటికల్ మైళ్ల దూరంలో పసుపు రంగులో ఉన్న ‘ముత్యాలమ్మ’ పేరుతో కూడిన బోటును గుర్తించినట్లు సమాచారం అందింది. దీనిపై అధికారులు అప్రమత్తమై, గుర్తించిన బోటు గల్లంతైన మత్స్యకారుల బోటేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించామని తెలిపారు. బోటులో ఇంధనం, ఆహార నిల్వలు, గల్లంతైన బోటులో సుమారు 1,000 లీటర్ల డీజిల్, దాదాపు 20 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నట్లు అధికారులకు సమాచారం ఉంది. ప్రస్తుతం సముద్ర వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండటంతో మత్స్యకారులు క్షేమంగా ఉండే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు.
కుటుంబ సభ్యులకు మంత్రి భరోసా
గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులతో జిల్లా యంత్రాంగం నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోందని,జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. గాలింపు చర్యల్లో లభిస్తున్న తాజా సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, మత్స్యకారులను సురక్షితంగా గుర్తించి ఒడ్డుకు చేర్చే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని మత్స్య శాఖ మంత్రి తెలిపారు. ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, మత్స్యశాఖ, భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీస్, తీర ప్రాంత రక్షణ విభాగాలు సమన్వయంతో గాలింపు, రక్షణ చర్యలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయని రాష్ట్ర మత్స్యశాఖ వెల్లడించిందని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఆర్డీవో ఎ.సరళావతి, అముడ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్ మత్స్యశాఖ జేడీ కరుణాకర్, మత్స్యశాఖ ఏడి రమణారావు, ఎఫ్ డి ఓ.శివరామకృష్ణ, ఎమ్మార్వోలు కూటమి నాయకులు మత్స్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








