ఆగస్టు 25న ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులకు జాబ్ మేళా
హైదరాబాద్: ఫార్మసీ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించేందుకు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో (UEI&GB/MCC) ఆధ్వర్యంలో ఆగస్టు 25న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న UEI&GB-MCC కార్యాలయంలో ఈ జాబ్ మేళా జరగనుంది. మెడ్‌ప్లస్ గ్రూప్‌లోని ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులు కలిపి మొత్తం 100 ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు.
డీ-ఫార్మసీ, బీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ బ్యూరో చీఫ్ టి. రాము (UEI&GB/MCC, OU) తెలిపారు.
ఎంపికైన వారికి ఫార్మసిస్ట్‌కు నెలకు రూ.25,000 వరకు, అసిస్టెంట్ ఫార్మసిస్ట్‌కు రూ.16,000 వరకు వేతనం అందనున్నట్లు పేర్కొన్నారు.
అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులతో ఆగస్టు 25న నేరుగా జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు HR శ్రీ సాయి శైలేష్ – 9666662481ను సంప్రదించాలని కోరారు.



