కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటుకు ఆలోచిస్తున్నారు
*పువ్వాడ పేరును లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు*
*ఆంధ్రప్రదేశ్ పాలకులు నీటి దోపిడీకి పాల్పడుతున్నారు*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ సెప్టెంబర్ 3
ఖమ్మం:
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసేందుకు ఆలోచిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ రైతు సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. రైతులను వంచించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆరోపించారు. రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయకుండానే మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ చేసినట్లు మంత్రులు నిరూపించాలని సవాల్ చేశారు.
రఘునాథపాలెం మండలంలో తాను సొంత నిధులతో నిర్మించిన రైతు వేదికకు తన సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ పేరును తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయని అన్నారు. ఖమ్మం జిల్లాలో ‘పువ్వాడ’ అనే పేరు లేకుండా చేయడమే వ్యవసాయ శాఖ మంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు.
ఉమ్మడి ప్రాజెక్టుల విషయంలో నీటి కేటాయింపులను తేల్చి, తెలంగాణకు దక్కాల్సిన సరైన వాటాలను పంపిణీ చేయకుండా రాష్ట్ర నీటి హక్కులను కాలరాస్తున్నారని తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్న ఆంధ్రప్రదేశ్ పాలకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన నీటిని అన్ని ప్రాజెక్టుల నుంచి సరైన విధంగా తరలించే ప్రక్రియ జరగడం లేదని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పాలకులు జల దోపిడీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు భూములు, ఇసుక, మట్టి దోపిడీలకు పాల్పడుతున్నారని పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. కాంట్రాక్టుల పేరుతో కమీషన్లు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజీవ్ కెనాల్ పేరుతో చేపట్టిన పనులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని విమర్శించారు.


