కూసుమంచి/ ఖమ్మం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కూసుమంచిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయకన్‌గూడెం నుంచి కూసుమంచి వరకు సుమారు 1,000 బైకులతో సాగిన ర్యాలీలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓపెన్‌టాప్ జీపులో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం కూసుమంచి ప్రధాన సెంటర్‌లో కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రజాపాలనపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. 3,475 రోజుల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, పిల్ల కాకులు కారు కూతలు మానుకోవాలని ఎద్దేవా చేశారు. పెద్ద దొర ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉద్యోగ నోటిఫికేషన్లతో సంక్షేమం, అభివృద్ధిని ప్రజల గడపకు చేర్చిందన్నారు.
పాలేరు నియోజకవర్గాన్ని సొంతిల్లుగా భావిస్తున్నానని, కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. పాలేరులో మళ్లీ గెలిచేది, నిలిచేది కాంగ్రెస్ేనని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బజ్జురి వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి హఫీజ్ ఉద్దీన్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, జూకూరి గోపాలరావు, కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి, పాలేరు సర్పంచ్ బానోత్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



