పరిశుభ్రతలోనే ప్రజారోగ్యం… రోగాల నిర్మూలనకు తొలి వ్యాక్సిన్ పారిశుద్ధ్యమే
జీహెచ్ఎంసీ ఆదిభట్ల సర్కిల్ పారిశుద్ధ్య విభాగంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సమీక్ష
ఇబ్రహీంపట్నం, జూలై 3: ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఉందని, వ్యాధుల నిర్మూలనకు తొలి వ్యాక్సిన్ పారిశుద్ధ్యమేనని, సమాజ ఆరోగ్యాన్ని కాపాడే తొలి డాక్టర్లు సఫాయి కర్మచారులేనని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని ఆదిభట్ల సర్కిల్‌కు చెందిన తుర్కయంజాల్, ఆదిభట్ల డివిజన్ల పారిశుద్ధ్య విభాగాధికారులు, సిబ్బందితో తొర్రూర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి వరకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ డిప్యూటీ కమిషనర్, సంబంధిత అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఒక్కొక్క శానిటేషన్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు, విధుల నిర్వహణ తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినా, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోతే ఆ అభివృద్ధి అంతా వృథా అవుతుందని పేర్కొన్నారు. ఈ విషయంలో పారిశుద్ధ్య సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని అన్నారు.
కాలనీలు అద్దంలా మెరిసేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి, వాటిని శాశ్వతంగా తొలగించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మళ్లీ అదే ప్రాంతాల్లో చెత్త పేరుకుపోకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
సిబ్బంది, సూపర్‌వైజర్లకు నెల రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించిన ఎమ్మెల్యే, 30 రోజుల తర్వాత పురోగతిపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అధికారులు కార్యాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిరోజూ ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి సిబ్బంది హాజరు, పనితీరును పరిశీలించాలని సూచించారు.
ప్రజల నుంచి తరచుగా వచ్చే డ్రైనేజీ లీకేజీలు, చెత్త పేరుకుపోవడం వంటి సమస్యలపై వెంటనే స్పందించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
శానిటేషన్ సిబ్బంది సమస్యలపై సీఎంతో చర్చిస్తా
పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. వారి రుణాన్ని ఎంతిచ్చినా తీర్చుకోలేమని, హైదరాబాద్ నగరంలో శానిటేషన్ సిబ్బందికి అందుతున్న విధంగా వేతనాలు, సౌకర్యాలు కల్పించే అంశాన్ని ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చిస్తానని హామీ ఇచ్చారు.
శానిటేషన్ సిబ్బంది ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న ఆయన, వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అంతేకాకుండా, పారిశుద్ధ్య నిర్వహణ అనేది కేవలం సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.







