*తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి*
ఎల్‌బీఆర్‌సీఈ ప్రిన్సిపాల్ డా. కె. అప్పారావు.
మైలవరం ఎన్టీఆర్ జిల్లా పున్నమి న్యూస్.
మాతృభాష తెలుగు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎల్‌బీఆర్‌సీఈ ప్రిన్సిపాల్ డా. కె. అప్పారావు పిలుపునిచ్చారు. మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. తెలుగు భాష విశిష్టత, ప్రాచీనత, సంస్కృతి, వైభవాన్ని ఈ తరం, రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. పోటీలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. కె. అప్పారావు మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అనే నానుడిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. తెలుగు భాష ఉనికిని చాటుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. తెలుగు అకాడమీలను పునరుద్ధరించడంతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో తెలుగును పాఠ్యాంశంగా కొనసాగిస్తూ భాషాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. తెలుగు భాషకు విశేష సేవలందించిన కవులు, రచయితలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగాధిపతి డా. బి. శివహరి ప్రసాద్ మాట్లాడుతూ తేనెలొలుకు తెలుగు భాష వైభవాన్ని, ప్రాభవాన్ని ప్రపంచానికి చాటేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర అధికారిక కార్యక్రమాలు తెలుగులో జరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తెలుగు వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు. తెలుగు భాష పరిరక్షణకు అవసరమైన చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
కార్యక్రమంలో తొలుత తెలుగు తల్లి చిత్రపటానికి పుష్పమాలలు వేసి తెలుగు తల్లిని, తెలుగు భాషను స్మరించుకున్నారు. అనంతరం వక్తృత్వం, వ్యాసరచన, క్విజ్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు తెలుగు భాషా సంస్కృతిని ప్రతిబింబించే పుస్తకాలు, సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. బి. రమేష్ రెడ్డి, డీన్లు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.




