ఎర్రుపాలెం /ఖమ్మం
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రింగ్ సెంటర్లోని అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు వైరా ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో మధిర రూరల్ సీఐ, మధిర టౌన్ సీఐ, వైరా సీఐ, సబ్ డివిజనల్ ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. వాహనాలకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పోలీసులకు సహకరించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడకుండా సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.



