Sunday, 27 September 2026

Tag: పోలీస్

ఖమ్మం

రోడ్డు ప్రమాదం నాటకం.. సహాయం చేసేందుకు వచ్చిన వ్యక్తి ఫోన్ చోరీ!

రోడ్డు ప్రమాదం జరిగినట్లు నాటకం ఆడి, సహాయం చేసేందుకు వచ్చిన వ్యక్తి వద్ద నుంచి ఖరీదైన సెల్‌ఫోన్ అపహరించిన ఘటన సోమవారం ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలో చోటుచేసుకుంది. బాధితుడు సాంబశివరావు కథనం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై నుంచి కిందపడినట్లు నటించడంతో, వారికి సహాయం చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడి జేబులో ఉన్న సుమారు రూ.1.30 లక్షల విలువైన సెల్‌ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై బాధితుడు ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఖమ్మం

బాధితుడి ఫోన్‌ను ట్రేస్ చేసి అప్పగించిన పోలీసులు

ఖమ్మం రూరల్ ముత్తగూడెం ప్రాంతానికి చెందిన దామల నాగయ్య తన తల్లి అనారోగ్యంతో ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆసుపత్రి బెంచ్‌పై నిద్రించిన నాగయ్య, ఉదయం లేచి చూడగా తన మొబైల్ ఫోన్ కనిపించలేదు. దీంతో ఖమ్మం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ రమేష్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎస్‌ఐ ఫోన్‌ను ట్రేస్ చేసి బాధితుడికి తిరిగి అప్పగించారు. దీంతో నాగయ్య పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మం

రోడ్డు రోలర్‌తో తొక్కించిన 385 బుల్లెట్ సైలెన్సర్లు.. రేపు వేలం: ట్రాఫిక్ సి ఐ బెల్లం సత్యనారాయణ వెల్లడి

నిబంధనలకీ విరుద్ధం వాహనాలకు అమర్చి వినియోగిస్తున్న 385 సైలెన్సర్లను ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసి తొలగించారు. అనంతరం వాటిని రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేసినట్లు ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ తెలిపారు. సీజ్ చేసిన సైలెన్సర్లను పాత ఇనుప సామగ్రిగా విక్రయించేందుకు సెప్టెంబర్ 7న వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో వేలం పాట జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల పాత ఇనుప దుకాణదారులు, వ్యాపారులు వేలంలో పాల్గొనాలని సీఐ సూచించారు.

ఖమ్మం

గణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు రౌడీషీటర్లపై నిరంతరం నిఘా: సీపీ సునీల్ దత్

రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. శనివారం పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుని ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, ప్రతి మండపం వద్ద భద్రతను పర్యవేక్షించాలని సూచించారు. నిమజ్జన మార్గాలు, ప్రదేశాలను ముందుగానే పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో తగినంత బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలన్నారు. ఊరేగింపుల్లో డీజేలు, అధిక శబ్దం, రెచ్చగొట్టే నినాదాలు, మద్యం సేవించి పాల్గొనడంపై నిఘా ఉంచాలని సూచించారు. అలాగే రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వారిపై ముందస్తు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీ సునీల్ దత్ ఆదేశించారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించాలని కోరారు.

ఖమ్మం

రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్‌లో గంజాయి కలకలం 1.5 కేజీల గంజాయి స్వాధీనం.. ఒడిశాకు చెందిన వ్యక్తి అరెస్ట్

ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలోని ఆటో స్టాండ్‌లో శనివారం ఎక్సైజ్ పోలీసులు 1.5 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎస్‌ఐ శ్రీహరి రావు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఆటో స్టాండ్ పరిసరాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఒడిశాకు చెందిన సింహాద్రి రావును తనిఖీ చేయగా అతని వద్ద 1.5 కేజీల గంజాయి లభించింది. దీంతో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, సింహాద్రి రావును అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.85 వేల వరకు ఉంటుందని ఎక్సైజ్ ఎస్‌ఐ శ్రీహరి రావు తెలిపారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారించడంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం సింహాద్రి రావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ శ్రీహరి రావు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

ఖమ్మం

ఖమ్మం రైల్వే స్టేషన్ కూడలిలో ట్రాఫిక్ జామ్..

ఖమ్మం రైల్వే స్టేషన్ కూడలి నిత్యం రద్దీతో కిక్కిరిసిపోతోంది. ఒకవైపు రైల్వే స్టేషన్, మరోవైపు మహిళా పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లు ఉండటంతో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. అయితే కూడలిలో ఆటోలు రోడ్డుపైనే అడ్డాగా మార్చుకోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంటోంది. ఆటోలను రోడ్డుపైనే నిలిపివేయడంతో పాటు ట్రాఫిక్ ఐలాండ్‌ను కూడా ఆటో డ్రైవర్లు వినియోగించుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన కూడలిలో కనీసం ఒక్క ట్రాఫిక్ పోలీసును కూడా విధుల్లో ఉంచకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు స్పందించి ఆటోలకు ప్రత్యేక పార్కింగ్/స్టాండ్ ఏర్పాటు చేసి, ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బందిని కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

ఖమ్మం

సైబర్ మోసాలకు ఖమ్మం కేరాఫ్‌ అడ్రస్‌ మ్యూల్ ఖాతాలపై టీజీసీఎస్బీ–పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌.. 52 మంది అరెస్ట్‌

ఖమ్మం జిల్లాలో సైబర్ మోసాల నివారణకు టీజీసీఎస్బీ, పోలీస్ శాఖ సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. చైనా ఆపరేటర్ల టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా అనధికార ఆన్‌లైన్ గేమింగ్ లావాదేవీలకు మ్యూల్ ఖాతాలను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేయడంతో ఇప్పటివరకు ఈ కేసుల్లో 52 మంది నిందితులు అరెస్టయ్యారు. జిల్లా వ్యాప్తంగా 30 బ్యాంకు శాఖల్లో 121 మ్యూల్ ఖాతాలు, 273 ఏటీఎం విత్‌డ్రా ఖాతాలను గుర్తించారు. వీటి ద్వారా రూ.7.84 కోట్ల లావాదేవీలు జరగగా, రూ.6.23 కోట్ల లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రత్యేక ఆపరేషన్‌లో 11 బృందాలు, 40 మంది పోలీసులు పాల్గొని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. గత ఫిబ్రవరిలో నిర్వహించిన ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0లో 75 మ్యూల్ ఖాతాలను గుర్తించి 25 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో వ్యాపారులు, కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు నలుగురు బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు. సైబర్ క్రైమ్స్ ఎస్పీ బి. సాయి శ్రీ పర్యవేక్షణలో, ఖమ్మం సీపీ సునీల్ దత్ సమన్వయంతో ఆపరేషన్ కొనసాగింది. కమీషన్ల కోసం బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, ఓటీపీలను ఇతరులకు ఇవ్వవద్దని పోలీసులు హెచ్చరించారు.

ఖమ్మం

వరకట్న వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం రాత్రి కేసు నమోదైంది. 3 టౌన్ సీఐ మోహన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం సారధి నగర్‌లో బానోత్ వరలక్ష్మి, బాబురావు దంపతులు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. బాబురావు తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి వరకట్నం కోసం భార్య వరలక్ష్మిని వేధించేవాడని సీఐ తెలిపారు. ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన వరలక్ష్మి గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మోహన్ బాబు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఖమ్మం

పాత నగలకు సాన పెడతామని నమ్మించి.. వెండి మాయం 18 తులాల వెండిని రసాయనంతో 8 తులాలకు తగ్గించిన మోసగాళ్లు

నేలకొండపల్లి/ ఖమ్మం పాత వెండి నగలకు సాన పెడతామని నమ్మించి వెండిని కాజేసిన ఘటన నేలకొండపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన పంకజ్, పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు పాత వెండి నగలకు సాన పెడతామని చెప్పి త్రివేణి వద్ద నుంచి 18 తులాల వెండి పట్టీలు తీసుకున్నారు. అనంతరం వాటిని రసాయనంలో వేసి సుమారు 8 తులాల వెండిగా తగ్గించినట్లు బాధితురాలు గుర్తించింది. దీంతో త్రివేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్రమత్తమైన స్థానికులు ఇద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పి. శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

ఖమ్మం

కిడ్నాప్‌ కేసులో ముగ్గురికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష

ఖమ్మం త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2018లో నమోదైన కిడ్నాప్‌ కేసులో ముగ్గురు నిందితులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ ఖమ్మం మూడో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి, జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి అరవ ప్రవీణ్ తీర్పు వెలువరించారు. ఈ వివరాలను త్రీ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ J. మోహన్‌ బాబు తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో ఒక్కొక్కరు అదనంగా మూడు నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేసు వివరాల ప్రకారం.. త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో Cr.No.83/2018 U/s 365 IPC, CC.No.285/2018గా నమోదైన కేసులో చక్కిలెల @ నాగమళ్ల సతీష్ (A1), చక్కిలెల సంతోష్ (A2), చక్కిలెల సుమన్ (A3) నిందితులుగా ఉన్నారు. 2018 ఏప్రిల్‌ 20న రాత్రి కిన్నెరసాని థియేటర్‌ ఎదురుగా ఉన్న కిరాణా జాగిరి మర్చంట్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన వివాహ కార్యక్రమం వద్ద కొత్త విశ్వనాధంతో గొడవపడి, అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకొని కిడ్నాప్‌ చేసి, రహస్య ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి భార్య కొత్త గీత ఏప్రిల్‌ 21న త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేశారు. అప్పటి దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్‌ U. వెంకన్న బాబు (ప్రస్తుతం DSP, ఇల్లందు) కాగా, బ్రీఫింగ్‌ ఆఫీసర్‌గా ఇన్స్పెక్టర్‌ J. మోహన్‌ బాబు, APP S. గాయత్రి సమర్థవంతమైన ప్రాసిక్యూషన్‌ నిర్వహించారు. CDO V. రామకృష్ణ, కోర్టు లైజన్‌ అధికారులు K. శ్రీకాంత్ (SI), K. శ్రీనివాస్ (HC), D. నాగేశ్వరరావు (HC) సహకరించారు. ప్రాసిక్యూషన్‌కు సహకరించిన అధికారులను పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్ అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.