Sunday, 27 September 2026

Tag: పోలీస్

ఖమ్మం

చోరీ కేసు లో నిందుతుడి అరెస్ట్ రూ.2.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం

తల్లాడ /ఖమ్మం తల్లాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన రెండు ఇంటి చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రూ.2.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వైరా సీఐ వెంకటప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఉదయం తల్లాడ బస్టాండ్ వద్ద జంగాల స్వరూప్‌కుమార్ అలియాస్ శాంతి స్వరూప్ అలియాస్ వినయ్‌కుమార్ (41)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 11న గంగదేవిపాడు గ్రామానికి చెందిన సిలివేరు నరసింహారావు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు తలుపు, ఇనుప బీరువా పగులగొట్టి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. దర్యాప్తులో నిందితుడిని గుర్తించిన పోలీసులు విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. అలాగే తల్లాడలో మరో ఇంటి తాళం పగులగొట్టి రెండు బంగారు ఉంగరాలు చోరీ చేసి, వాటిని గన్నవరంలోని ఎస్‌ఆర్‌ బంగారం దుకాణంలో విక్రయించినట్లు వెల్లడించాడు. తల్లాడ ఎస్‌ఐ ఎన్.వెంకటకృష్ణ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. నిందితుడికి గతంలోనూ పలు చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతర ఆస్తి నేరాలపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఖమ్మం

లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి: సిపీ సునీల్ దత్

ఖమ్మం: సెప్టెంబర్‌ 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను దృష్టిలో ఉంచుకుని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసులను గుర్తించి, త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్ అధికారులను ఆదేశించారు. గురువారం పోలీస్‌ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులతో పాటు రాజీకి అవకాశం ఉన్న కేసులను ఇరుపక్షాల సమ్మతితో స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే అవకాశం లోక్‌ అదాలత్‌ ద్వారా లభిస్తుందని తెలిపారు. అధికారులు తమ పరిధిలోని కేసులను సమీక్షించి, లోక్‌ అదాలత్‌కు పంపేందుకు అర్హత ఉన్న కేసులను గుర్తించాలన్నారు. ఫిర్యాదుదారులు, నిందితులు, ఇతర పక్షాలకు లోక్‌ అదాలత్‌ ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. న్యాయ సేవా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ రామానుజం, ఏసీపీ మహేష్, నరసింహరావు, సీఐ సర్వయ్య పాల్గొన్నారు.

ఖమ్మం

నకిలీ బంగారంతో ఫైనాన్స్ సంస్థకు టోకర పెట్టిన వ్యక్తుల. అరెస్ట్

ఖమ్మం నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు పొందుతూ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని ఖమ్మం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ ఏసీపీ మహ్మద్ సర్వర్ పర్యవేక్షణలో, ఇన్‌స్పెక్టర్ ఎస్. రాజ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. నిందితులు ఇసంపల్లి సాయివంశీ (34), షేక్ మహబూబ్ (33), జూపల్లి రాము (35)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 11 నకిలీ బంగారు ఉంగరాలు, 35.8 గ్రాముల బరువు, సుమారు రూ.4 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కొక్కిరేణి సందీప్ (27), ముండాడ రామచందర్ (39) పరారీలో ఉన్నారు. ఎస్‌ఐ వంశీ, హెడ్ కానిస్టేబుల్ ఓం ప్రకాశ్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, హరి, జానీ, నరసింహారావు, శ్రీధర్, సతీష్‌లను సీపీ సునీల్ దత్ అభినందించారు.

విశాఖపట్నం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ‘రాష్ట్రపతి అవార్డు’ అందుకున్న ‘క్లూస్ టీమ్’ ఇంచార్జ్ సిరికి లక్ష్మీ నరసింహారావు

అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో ఆర్ఎస్ఐ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిరికి లక్ష్మీ నరసింహారావు ప్రతిష్టాత్మక “ప్రెసిడెంట్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్ – 2024 (ఉత్తమ సేవా పతకం)” అందుకున్నారు. అమరావతి (నేలపాడు)లో వైభవంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ​విధుల్లో ఆయన ప్రదర్శించిన అత్యున్నత క్రమశిక్షణ, నిబద్ధత, విశిష్ట సేవలను గుర్తించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 43 ఏళ్ల సుదీర్ఘ సేవ – ‘క్లూస్ టీమ్’లో 25 ఏళ్ల నైపుణ్యం: లక్ష్మీ నరసింహారావు కి పోలీస్ శాఖలో 43 ఏళ్ల సుదీర్ఘ సేవా అనుభవం ఉంది. అందులో గత 25 ఏళ్లుగా విశాఖపట్నం సిటీ, అనకాపల్లి, మరియు ఏఎస్ఆర్ జిల్లాల్లో ‘క్లూస్ టీమ్’ (CLUES Team) విభాగంలో సమర్థవంతంగా విధులు నిర్వహించారు. ​హత్యలు, దొంగతనాలు, రాబరీ, డకోయిటీ, అనుమానాస్పద మరణాలు తదితర సంఘటనల్లో ఘటనా స్థలాల నుంచి భౌతిక ఆధారాలను అత్యంత నైపుణ్యంతో సేకరించారు. ​సేకరించిన ఆధారాలను ఎఫ్ఎస్ఎల్ (FSL) ద్వారా దర్యాప్తు అధికారులకు (IO) అందించి, క్లిష్టమైన కేసుల్లో నిందితులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా కీలక పాత్ర పోషించారు. గతంలో సాధించిన పురస్కారాలు: ​70 క్యాష్ రివార్డులు (Cash Rewards), ​20 జీఎస్సీలు (GSCs), ​సేవా పతకం, వీటన్నింటికీ మకుటంగా ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకం దక్కడం విశేషం. ​జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ప్రత్యేక అభినందనలు: రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఆర్ఎస్ఐ లక్ష్మీ నరసింహారావును అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ బుధవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. *ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ — “నేర దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణ అత్యంత కీలకమైనది. లక్ష్మీ నరసింహారావు క్లూస్ టీమ్‌లో 25 ఏళ్లుగా నిబద్ధతతో అందించిన సేవలు ప్రశంసనీయం. ఆయన కృషికి దక్కిన సరైన గుర్తింపు ఇది. ఇది అనకాపల్లి జిల్లా పోలీస్ యంత్రాంగానికి దక్కిన గొప్ప గౌరవం” అని కొనియాడారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, క్లూస్ టీమ్ ఇన్ స్పెక్టర్ టి.విజయ, తోటి సిబ్బంది పాల్గొని ఆర్ఎస్ఐ లక్ష్మీ నరసింహారావు కి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఖమ్మం

కలప అక్రమ రవాణా కేసులో ఇద్దరు అరెస్ట్

ఫారెస్ట్ అధికారులు జారీ చేసిన అనుమతి పత్రాలను ట్యాంపరింగ్ చేసి కలపను అక్రమంగా రవాణా చేసిన ఇద్దరు నిందితులను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. CCS ఏసీపీ మహ్మద్ సర్వర్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం ఫారెస్ట్ రేంజర్ ఫిర్యాదు మేరకు గత డిసెంబర్‌లో కేసు నమోదు కాగా, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలతో ఏసీపీ మహ్మద్ సర్వర్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ ఎస్. రాజ్‌కుమార్ గౌడ్ దర్యాప్తు చేపట్టారు. నల్లతుమ్మ కర్ర కోసం తీసుకున్న అనుమతి పత్రాలను ట్యాంపరింగ్ చేసి ‘సండ్ర కర్ర’గా మార్చి అయ్యగారుపల్లి, కురవి, సీరోలు, కంపెళ్లి, మహబూబాబాద్ ప్రాంతాల్లో సండ్ర చెట్లను నరికి విజయవాడకు చెందిన రాధే శ్యామ్‌కు విక్రయించిన సూర్యాపేట జిల్లా మోతే మండలం గోప్య తండాకు చెందిన కర్ర వ్యాపారి కొర్ర శివతో పాటు రాధే శ్యామ్‌ను అరెస్ట్ చేశారు. కొర్ర శివపై వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ ఫారెస్ట్ కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. రాధే శ్యామ్ ఈ కలపను మధ్యప్రదేశ్ జాబువాలోని AM ఎంటర్ప్రైజెస్ అబ్దుల్ రహేమాన్‌కు సరఫరా చేసినట్లు తెలిపారు. సుమారు 9 లారీల కలపను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు వెల్లడించారు. కేసులో ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది. సిబ్బంది ఎస్‌ఐ ఎ. వంశీకృష్ణ, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, హరి, జానీ, నరింహారావు, సుధీర్, సతీష్, సుందర్, శ్రీధర్‌లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు .

ఖమ్మం

ట్రాఫిక్ జామ్‌కు చెక్.. ఆక్రమణల తొలగింపు.. ట్రాఫిక్ సిఐ బెల్లం సత్య నారాయణ ఆధ్వర్యంలో చర్యలు..

ఖమ్మం ఆగష్టు 12 (పున్నమి ప్రతి నిధి) నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ, డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కలిసి ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, బోర్డులను తొలగించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని సీఐ సత్యనారాయణ తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఖమ్మం

రైలు మార్గంలో గంజాయి తరలింపు భగ్నం

ఖమ్మం ఆగష్టు 12 (పున్నమి న్యూస్) రైలు మార్గంలో ఖమ్మానికి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ బృందాలు మోతీనగర్ సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పదంగా కనిపించిన సంచులను పరిశీలించగా 15.7 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని ఖమ్మం-2 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గంజాయి తరలింపులో ఉన్న నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐలు నాగరాజు, వెంకటేష్ తెలిపారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.