Monday, 24 August 2026

Tag: Telangana

హైదరాబాద్

సురేఖ వివరణపై నిర్ణయం వాయిదా

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మూడు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణతో పాటు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల వీడియోలను పరిశీలించినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై వచ్చిన ఫిర్యాదు, ఆయన వివరణను కూడా సమీక్షించామని తెలిపారు. ఆదిలాబాద్ వివాదం, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి సస్పెన్షన్, సిద్ధిపేట–గజ్వేల్ ఘటనలపై కమిటీ పరిశీలన కొనసాగుతోందన్నారు. కొండా సురేఖ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, చర్యలపై ఇప్పుడే గడువు చెప్పలేమని మల్లు రవి స్పష్టం చేశారు.

వనపర్తి

నోటీసు వెనక్కి తీసుకోండి

కాంగ్రెస్‌ క్రమశిక్షణా కమిటీకి మాజీ మంత్రి చిన్నారెడ్డి లేఖ రాశారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల ఆవేదననే వ్యక్తపరిచానన్నారు. స్థానిక ఎమ్మెల్యే వ్యవహారం ఒంటెద్దు పోకడలా ఉందని పేర్కొన్నారు. ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించి తనకు ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలని కోరారు.

తెలంగాణ

లివర్‌పూల్‌తో తెలంగాణ భాగస్వామ్యం

లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్ విభాగానికి చెందిన సుసాన్ ఫిన్నెగాన్, నూలా గల్లాఘర్‌తో పాటు లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక ఆర్థిక రంగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి చూపింది. భాగస్వామ్యాన్ని అధికారికంగా ఖరారు చేసేందుకు లివర్‌పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్‌లో హైదరాబాద్‌ను సందర్శించనుంది.

హైదరాబాద్

అమెరికా పర్యటన రద్దు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం రాజకీయ క్లియరెన్స్‌ ఇవ్వలేదని సీఎం కార్యాలయం తెలిపింది. దీంతో అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న రేవంత్‌రెడ్డి ఆగస్టు 23న లండన్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అయితే బోస్టన్‌, న్యూయార్క్‌లో హార్వర్డ్‌, MIT తదితర విద్యాసంస్థలతో ప్రతిపాదిత ఒప్పందాల ప్రక్రియను అధికారులు కొనసాగించాలని సీఎం ఆదేశించారు.

తెలంగాణ

ఫిర్యాదుల పరిష్కారానికి PSCMS

తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలలపై ఫిర్యాదుల కోసం PSCMS ఆన్‌లైన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. తల్లిదండ్రులు, విద్యార్థులు మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి OTP ధృవీకరణ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. నమోదైన ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ ట్రాకింగ్ మెకానిజం ఏర్పాటు చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే ఈ కొత్త విధానం ప్రధాన లక్ష్యం.

తెలంగాణ

సురేఖ వివరణ లేఖ

టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీసుపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని స్పష్టం చేశారు. కుటుంబ బంధం ఆధారంగా తనను రాజకీయంగా బాధ్యురాలిని చేయడం సముచితం కాదన్నారు. కాంగ్రెస్ నాయకత్వం, పార్టీ క్రమశిక్షణపై సంపూర్ణ గౌరవం ఉందని పేర్కొంటూ, తన ప్రమేయం లేదని గుర్తించి నోటీసును ఉపసంహరించుకోవాలని కమిటీ చైర్మన్ మల్లు రవికి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్

నిధి అగర్వాల్‌పై ఈడీ విచారణ

హైదరాబాద్‌లో నటి నిధి అగర్వాల్‌ను ఈడీ అధికారులు నాలుగు గంటల పాటు విచారించారు. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రచారానికి సంబంధించిన అంశాలపై ప్రశ్నించారు. జీత్‌విన్‌తో పాటు ఇతర యాప్స్ ప్రమోషన్ ఒప్పందాలు, తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలను పరిశీలించినట్లు సమాచారం. విచారణ అనంతరం నిధి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

హైదరాబాద్

ఇంటర్ వ్యాల్యుయేషన్ స్కాంపై విచారణ

తెలంగాణ ఇంటర్మీడియట్ పేపర్ల వ్యాల్యుయేషన్‌లో గ్లోబరినా సంస్థకు కాంట్రాక్టు కేటాయింపుపై వచ్చిన అక్రమాల ఆరోపణలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో అప్పటి నిర్ణయాలు, టెండర్ నిబంధనలు, చెల్లింపుల వివరాలపై మాజీ కార్యదర్శి అశోక్‌ను ప్రశ్నిస్తున్నారు. బాధ్యులపై ఆధారాల మేరకు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

హైదరాబాద్

సీడబ్ల్యూసీ కీలక సమావేశం

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కేసీ వేణుగోపాల్, చిదంబరం, జైరాం రమేశ్, సచిన్ పైలట్ సహా సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్

22ఏ సమస్యను నెలాఖరులోగా పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి

22ఏ నిషేధిత జాబితాలో అధికారుల పొరపాట్ల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సమస్య పరిష్కారానికి ఇప్పటికే చర్యలు చేపట్టామని, ఇటీవల పలు రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను స్వయంగా పరిశీలిస్తానన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి నెలాఖరులోగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హరీశ్‌రావు, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. ఫీనిక్స్, రాఘవ కంపెనీల మధ్య వ్యాపార లావాదేవీలపై వస్తున్న ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.