Thursday, 7 May 2026

Tag: Telangana

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా నగదు పంపిణీ చేయాలి

*ఈ ఏడాదైనా నాణ్యమైన చేప పిల్లలను సరైన సమయంలో అందించాలి* *రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ కు పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ల వినతి పత్రం* *_మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్_* మంథని/ హైదరాబాద్, ఆగస్టు 01, పున్నమి ప్రతినిధి: ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో నాసిరకం చేప పిల్లలను ఆలస్యంగా అందడం వలన, చేపలు పెరగక మత్స్య కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని రాష్ట్ర ఫిషరీస్ కార్యాలయంలో ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ను శుక్రవారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్లు కలిశారు. ఈ క్రమంలో ఆయనకు మత్స్య కార్మికుల పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో గత ఏడాది నాసిరకం చేప పిల్లలను చాలా ఆలస్యంగా ఇవ్వడంతో, రాష్ట్ర వ్యాప్తంగా వాటిని తిరిగి వెనక్కి పంపడం జరిగిందనీ గుర్తు చేశారు. ఈ ఏడాదైనా నాణ్యమైన పెద్ద చేప పిల్లలను, సరైన సమయంలో అందించాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్స్య కార్మికులకు ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా, నగదు పంపిణీ కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పథకాలు పెట్టీ మత్స్యకారులకు తోడుగా ఉండాలని వారు కోరారు. సమస్యల పైన రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ గత యేడాది జరిగిన తప్పులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకొని మత్స్య కార్మికులకు కొత్త పథకాలు పెట్టీ ప్రోత్స్యహిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా డైరెక్టర్స్ పోతరవేని క్రాంతి కుమార్, అయిలావేని వీరాస్వామి, పెద్దపల్లి సుజాత పోచయ్య, చిట్ల శ్రీనివాస్, తాళ్ళ తిరుపతి, రేళ్ళ కోటయ్య, బోయిరి శ్రీకాంత్, పొలవేని మొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ పిట్టల రవి కుమార్, పాల్గొన్నారు.

తెలంగాణ పిల్లలకు పెద్దపల్లి

ప్రతి స్కూల్ బస్సులోను తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలి.

*డ్రైవర్స్ ఏ చిన్న తప్పు చేసినా.. స్కూల్ యాజమాన్యందే బాధ్యత.* *ప్రతి స్కూల్ బస్సులోను తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలి.* *_పెద్దపల్లి డీసీపీ కరుణాకర్_* రామగుండం, జులై 30, పున్నమి ప్రతినిధి:  పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని అడ్డగుంటపల్లి లోని ఆద్య బ్యాంకెట్ హాల్ లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి ఆధ్వర్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్, గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని స్కూల్, కళాశాల యజమానులు, బస్ డ్రైవర్లకు బుధవారం అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ లు ముఖ్య అతిథులుగా హాజరై, పలు ఆదేశాలు, సూచనలు చేశారు. స్కూల్, కళాశాలల యాజమాన్యాలు నైపుణ్యం గల డ్రైవర్లను నియమించుకోవాలని, పిల్లలను బస్సు ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే బస్సులను నిలుపుదల చేయాలన్నారు. డ్రైవర్లు ఓవర్ టేకింగ్ చేయవద్దని సూచించారు. బస్సు డ్రైవర్లు మద్యం సేవించి, సెల్ఫోన్లు ఉపయోగించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్ లలో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సిలిండర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. బస్సులో సీట్లకు సరిపడా విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలని డీసీపీ పేర్కొన్నారు. స్కూల్ బస్సు డ్రైవర్ లకు పోలీస్ వారి తరుపున ముఖ్యమైన సూచనలు చేశారు. పిల్లల భద్రత కోసం డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, విద్యార్థులను ఎక్కించేటప్పుడు, బస్సు దించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, బస్సును క్రమం తప్పకుండా ప్రతి రోజూ తనిఖీ చేయాలని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, మూల మలుపుల వద్ద, ప్రధాన కూడల్ల వద్ద వేగాన్ని నియంత్రించాలని, విద్యార్థుల భద్రత కోసం బస్  పూర్తిగా ఆగిన తరువాత పిల్లలను ఎక్కించడం, దించడం కోసం ఒక వ్యక్తిని విద్యార్థులకు సహాయంగా ఏర్పాటు చేయాలని, టైర్లు, బ్రేక్లు, ఇతర ముఖ్యమైన భాగాలను పరిశీలించాలని, ఏవైనా సమస్యలు ఉంటే, వాటిని యాజమాన్యం కు చెప్పి వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులను అప్రమత్తంగా ఉంచడం కోసం విద్యార్థులకు బస్సు భద్రతా నియమాల గురించి అవగాహన కల్పించాలని, బస్సులో ప్రవర్తన ఎలా ఉండాలో వారికి చెప్పాలని కోరారు. విద్యార్థులు బస్సులో సురక్షితంగా ప్రయాణించేందుకు బాధ్యత వహించాలనే విషయం గుర్తుంచుకోవాలని, మొదటగా ప్రథమ చికిత్స కిట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని,  బస్సులో అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని, సమయపాలన పాటిస్తూ సమయానికి బస్సును నడపడానికి ప్రయత్నించాలని, విద్యార్థులతో ఓపిక, సహనంగా ఉంటూ మంచి ప్రవర్తనతో ఉండాలని, పిల్లలకు ఏదైనా సమస్య తలెత్తితే, దానిని పరిష్కరించడానికి, యాజమాన్యం, తల్లితండ్రుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నించాలని, అవసరమైనప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలని, బస్సులో భద్రత ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించాలని పలు కీలక సూచనలు చేశారు. డ్రైవర్లు మద్యం మత్తులో స్కూల్ బస్సులు నడిపినట్లు గుర్తిస్తే అలాంటి వారిపై ఎట్టి పరిస్థితుల ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని, ఏదైనా ప్రమాదం జరిగితే స్కూల్ యాజమాన్యం పైన కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై నమోదు చేయు కేసులు, శిక్షల గురించి వివరించారు. అతివేగంగా అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురి చేయడం వలన మరణం సంభవిస్తే – 106(1) BNS [304-A IPC], సిగ్నల్ జంప్ చేసిన సందర్భం, రాంగ్ రూట్ లో వెళ్ళిన సందర్భంలో మరణం సంభవిస్తే, బలమైన సందర్భంలో – 105 BNS [304(ii) IPC], అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ఒక వ్యక్తికి – సాధారణ గాయాలు అయిన సందర్భంలో – 125(a) BNS [337 IPC], బలమైన గాయాలు అయిన సందర్భంలో –  125(b) BNS [338 IPC], పట్టణ ప్రాంతంలో, రద్దీ ప్రదేశాలలో, సాధారణ సమయంలో అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు  నడిపినచో సాధారణ గాయాలు అయిన సందర్భంలో – 125 BNS [336 IPC], బలమైన గాయాలు అయిన సందర్భంలో – 281 BNS [279 IPC], మైనర్ కి వాహనం ఇచ్చి ప్రమాదానికి గురి చేసినట్లయితే – 180 MV Act, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లయితే – 3 r/w 181 MV Act, మద్యం తాగి వాహనం నడినట్లయితే – 185 MV Act, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపినట్లు అయితే – 196 MV Act, సెక్షన్ల ప్రకారం చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, మంథని సీఐ రాజు, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధు, గోదావరిఖని వన్ టౌన్ ఎస్ఐలు రమేష్, భూమేష్ అనూష, ఎన్టిపిసి ఎస్ఐ ఉదయ్ కిరణ్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్సై వెంకటేష్, కమాన్పూర్ ఎస్సై ప్రసాద్, రామగిరి ఎస్సై శ్రీనివాస్, మంథని ఎస్ఐ రమేష్, ముత్తారం ఎస్సై నరేష్, స్కూల్స్ కళాశాల ప్రిన్సిపల్స్, డ్రైవర్స్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

*కార్మికుల హక్కుల కోసం రాజీ లేని పోరాటాలు నిర్వహించాలి*

*ఘనంగా మంథని మున్సిపాలిటీ నాలుగవ మహాసభలు* *కార్మికుల హక్కుల కోసం రాజిలేని పోరాటాలు నిర్వహించాలి* మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఫ్రెండ్స్ క్లబ్ లో మంథని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ నాలుగవ మహాసభ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో సీనియర్ మున్సిపల్ కార్మికుడు వడ్లకొండ రాజయ్య జండా ఆవిష్కరణ చేశారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ మంథని మున్సిపాలిటీ కార్మికులు స్థానికంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించుకున్నారని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. అదే పోరాట స్ఫూర్తితో రానున్న కాలంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై రాజీ లేని పోరాటాలు నిర్వహించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రావణపల్లి వెంకటస్వామి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ పాల్గొనగా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మంథని లింగయ్య సహార్థ సందేశం ఇవ్వగా, మున్సిపల్ కార్మికులు గడిపెళ్లి మల్లేష్, చిప్పకుర్తి చందు, సింగారపు గట్టయ్య, భాగ్య, పోచమ్మ, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి విద్య విజ్ఞానం

మంథని గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కు దరఖాస్తుల ఆహ్వానం

*మంథని గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కు దరఖాస్తుల ఆహ్వానం* మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్ మీడియట్ 2025 – 2026 మొదటి విద్యా సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో మిగిలిన ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ నెల 31 తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉటూరి శ్రీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంథని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇదివరకే దరఖాస్తు సమర్పించిన విద్యార్థులు కూడా ఈ స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చునని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. విద్యార్థులు తమ అన్ని అర్హతలను తెలియజేసే సర్టిఫికెట్లతో ఈ నెల 31 తేదీన ఉదయం 9 గంటలకు తమకు అడ్మిషన్ కావాల్సిన గురుకుల జూనియర్ కళాశాలలో హాజరుకావాలని ఆయన వివరించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యార్థుల దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేస్తారని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత, మెరిట్ లిస్టు ప్రకటించి, వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి, సీట్లు కేటాయిస్తారని తెలిపారు. అడ్మిషన్లన్నీ రిజర్వేషన్ ప్రకారం, పదవ తరగతిలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన కేటాయించబడతాయన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్ కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల అర్హతలను వివరించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2025 సంవత్సరంలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షలలో ఒకే ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలనీ, విద్యార్థులు తమ స్వంత జిల్లా/ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలనీ, పదవ తరగతి తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, పదవ తరగతి మార్కుల మెమో, అవసరమైన సర్టిఫికెట్ లన్ని కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకొనే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో సంవత్సరానికి రూ. 2,00,000, గ్రామీణ ప్రాంతంలో రూ. 1,50,000 మించకూడదనీ, ఇందుకు సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని 2025 జనవరి 1 వ తేదీన లేదా అంతకుముందు తేదీలో తహశీల్దార్ జారీ చేయాలనీ, విద్యార్థుల వయస్సు 2025 ఆగస్టు 31 తేదీ నాటికి 17 సంవత్సరాలు మించకూడదనీ, ఈ విషయంలో ఎస్సీ విద్యార్థులందరికీ ఒక సంవత్సరం సడలింపు ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు.

తెలంగాణ పెద్దపల్లి

మంథని మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

*మంథని మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: బయోమెట్రిక్ విధానం ద్వారా వైద్య సిబ్బంది హాజరు నమోదు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంథని మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు మంథని పట్టణ కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాత శిశు ఆసుపత్రి, గోపాల్పూర్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గద్దలపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో వార్డులను క్షుణ్ణంగా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగుల కొరకు నూతనంగా నిర్మించిన షెడ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో సిబ్బంది, వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని, ప్రతిరోజు తప్పనిసరిగా వివరాలను బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. మాత శిశు ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను గర్భిణీ మహిళలకు అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గోపాల్పూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు. గద్దెలపల్లి ప్రాథమిక ఆసుపత్రిని పరిశీలించి ఏఎంసీ ప్రొఫైల్ సక్రమంగా నిర్వహించాలని, ఎన్సీడీ స్క్రీనింగ్, ఎక్స్రే, టీబీ, ముక్తు భారత్, ఆరోగ్య మహిళా తదితర వాటిపై ఆరా తీశారు. ఓ పీ సేవలు పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఎంపీడీవో శశికళ, మంథని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, ఏఈపిఆర్ అనుదీప్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ బృందం

*మంత్రి శ్రీధర్ బాబును కలిసిన మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ బృందం* మంథని/హైదరాబాద్, జులై 27, పున్నమి ప్రతినిధి: మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా కుడుదుల వెంకన్న, వైస్ చైర్మన్, డైరెక్టర్లు శనివారం హైదరాబాద్ లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేసి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మంథని మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు అభినందనలు తెలియజేశారు. ఇదే క్రమంలో మంత్రి మాట్లాడుతూ చైర్మన్, డైరెక్టర్లు అందరూ కలిసి రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని తెలిపారు. రైతులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, రైతుల కష్టాలను తీర్చడానికి వారి వెన్నంటే ఉండాలని, వారికి అన్ని విధాలుగా సహాయం చేయాలని అన్నారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో మంథని మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, వివిధ మండలాల చైర్మన్స్, డైరెక్టర్స్ పాల్గొనడం జరిగింది.

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

జూనియర్ సివిల్ జడ్జిని సన్మానించిన ఇనుముల..!!

*జూనియర్ సివిల్ జడ్జిని సన్మానించిన ఇనుముల…!!* మంథని/హైదరాబాద్, జులై 27, పున్నమి ప్రతినిధి: ఉస్మానియా యూనివర్సిటీలోని న్యాయ కళాశాలలో ఎల్ ఎల్ ఎం ప్రథమ సంవత్సరం చదువుతూ, ఇటీవల ప్రకటించిన జ్యుడిషియరీ నియామక ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జి ( జే సీ జే ) గా ఎన్నికయిన సహచర విద్యార్థిని ధరావత్ సుష్మ ను తమ బ్యాచ్మెట్, పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది, లాయర్స్ ఇండియా ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇనుముల సత్యనారాయణ (సతీష్ ) అభినందనలు తెలిపి శాలువాతో సత్కరించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో తమతో పాటు పీజీ చేస్తున్న సుష్మ జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్ లో జ్యుడిషియర్ విభాగంలో మరింత ఎత్తుకు ఎదుగాలని పలువురు ఆకాంక్షించారు. అదేవిధంగా పదవ తరగతి వరకు సూర్యాపేట జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో చదివి, ఆ తర్వాత హైదరాబాద్ లోని పెండెకంటి న్యాయ కళాశాలలో ఎల్ ఎల్. బి పూర్తి చేసి, గ్రామీణ నేపథ్యం న్యాయ శాస్త్ర ప్రతిభకు అడ్డురాదనీ నిరూపించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయిన సుష్మ ను సహచర విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయశాస్త్ర పీజీ విద్యార్థి ఇనుముల సత్యనారాయణ తో పాటు సహచర పీజీ విద్యార్థులు నరేష్ రాథోడ్, ప్రభావతి, నవీన్ కుమార్, ఆనంద్, వేణుగోపాల్, సువర్ణ, శరత్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ మంచిర్యాల

పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి

*పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి* మంచిర్యాల, జులై 26, పున్నమి ప్రతినిధి: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ ను బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకుల ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి, నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 పార్టీల నుండి 32 పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయనీ, అలాగే దేశంలోని 9 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికీ, బీసీ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రవేశ పెట్టలేరో బీసీ సమాజానికి చెప్పాలని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా, బీసీలకు ప్రజాస్వామ్య వాటా దక్కకపోవడం బాధాకరం అని అసహనం వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రకులాలే దేశాన్ని, రాష్ట్రాన్ని 78 సంవత్సరాలుగా పాలిస్తున్నారనీ, దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్షగా మారిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా సామాజిక న్యాయం అని అడుగుతున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ఎంతో, వారి వాటా అంతా అని రాజ్యాంగం చెప్తుంటే, ఈ అగ్రకులాలు బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజెల్లి వెంకటయ్య, సీనియర్ నాయకుడు కర్రె లచ్చన్న, జిల్లా కార్యదర్శి శాఖపురి భీం సేన్, నాయకులు అంకం సతీష్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తోలగింపు

*లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తోలగింపు* *_పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష_* రామగుండం, జులై 25, పున్నమి ప్రతినిధి: లంచం డిమాండ్ చేసిన ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జనరల్ ఆసుపత్రి లో శుక్రవారం ఆకస్మిక తనిఖీ సమయంలో ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఏజేన్సీ ద్వారా పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న హనుమంతు, లావణ్య రోగుల నుంచి లంచం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని పేషెంట్ బెడ్ల వద్ద క్లీనింగ్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రోగుల ఫిర్యాదు ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వెంటనే సంబంధిత ఔట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను టెర్మినెట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బంది హనుమంతు, లావణ్య లను ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అనుమతించడానికి వీలులేదని కలెక్టర్ గోదావరిఖని జనరల్ ఆసుపత్రి వైద్య సూపరింటెండెంట్ ను ఆదేశించారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య వసతులను పూర్తి ఉచితంగా అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంటే ఇటువంటి ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ, పేద రోగులను ఇబ్బందులకు గురి చేస్తూ, జిల్లా యంత్రాంగానికి అవమానకర పరిస్థితులు తీసుకువచ్చారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసే సిబ్బంది ఇంకా ఎవరైనా ఉంటే గుర్తించి విధుల నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ సంబంధిత ఏజెన్సీ వర్గాలను హెచ్చరించారు.

జయశంకర్ భూపాలపల్లి తెలంగాణ

విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని వినతి

*విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని వినతి* మహదేవపూర్, జులై 25, పున్నమి ప్రతినిధి: భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కళాశాల ప్రిన్సిపల్ ఎన్. నర్సయ్య శుక్రవారం భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు కు వినతిపత్రం సమర్పించారు. ప్రతి దినం కాలేశ్వరం నుండి వచ్చే విద్యార్థులకు కళాశాలకు సమీపములో గల బోమ్మాపూర్ ఎక్స్ రోడ్ వద్ద బస్సులు ఆపాలని వారు కోరారు. దీంతోపాటు మహదేవ్ పూర్ మండలంలోని సర్వాయి పేట, పంకేన, అంబటిపల్లి, సూరారం, గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం శనివారం నుండి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన డిపో మేనేజర్ ఇందు కు కళాశాల అధ్యాపకులు కృతజ్ఞతలు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రసాద్, రమేష్,పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.