Thursday, 7 May 2026

Tag: Telangana

జాతీయ అంతర్జాతీయ తెలంగాణ హైదరాబాద్

ఇ గవర్నెన్స్, డిజిటలైజేషన్లో ఎస్తోనియా దేశ సహకారం తీసుకుంటాం: ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు

*ఇ గవర్నెన్స్, డిజిటలైజేషన్లో ఎస్తోనియా దేశ సహకారం తీసుకుంటాం: ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు* హైదరాబాద్/మంథని, జులై 25, పున్నమి ప్రతినిధి: ఇ – గవర్నెన్స్, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా దేశ సహకారం తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ రెండు రంగాల్లో ఎస్తోనియా దేశం అగ్రగామిగా ఎదగడం అబ్బురపరుస్తోందని ఆయన ప్రశంసించారు. శుక్రవారం ఎస్తోనియా దేశ రాయబారి మ్యారియే లూప్ ఆధ్వర్యంలో సచివాలయంలో తనను కలిసిన వాణిజ్య ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వీరిలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజి, కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఆరోగ్య రంగాల ప్రతినిధులు ఉన్నారు. తెలంగాణా ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్లో ఇంకా ప్రథమ దశలోనే ఉందని, వంద శాతం ప్రగతి సాధించిన ఎస్తోనియా దేశం తమకు సాంకేతిక సహకారం అందించాలని శ్రీధర్ బాబు కోరారు. వాణిజ్యం, ఏఐ సాంకేతికతలో కూడా కలిసి పనిచేయాలన్ని ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. ప్రజా సేవల విభాగాలను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఇ – గవర్నెన్స్ కీలకమని ఆయన తెలిపారు. ఇందులో ఎస్తోనియా దేశ తోడ్పాటును కోరుతున్నామని, సైబర్ సెక్యూరిటీలో కూడా పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందనీ, డ్రోన్ టెక్నాలజిలో తెలంగాణాలో గణనీయ అభివృద్ధి సాధించిందనీ మంత్రి తెలిపారు. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో హైదరాబాద్ లో తయారైన డ్రోన్లు శత్రు దేశానికి భారీ నష్టం కలిగించాయనీ, భవిష్యత్తు యుద్ధాలు డ్రోన్లు, సైబర్ దాడులతోనే జరుగుతాయని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండెడ్ మద్యం ఉత్పత్తిలో ముందున్నామని, ఈ రంగాల్లో కూడా కలిసి పనిచేసే విషయాన్ని పరిశీలించాలనీ ప్రతినిధులను కోరారు. సెప్టెంబరులో తమ దేశం సందర్శించాలని ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్ చేసిన అభ్యర్థనకు శ్రీధర్ బాబు స్పందించారు. తమ అధికారుల బృందం వస్తుందని, విద్య, ఇ గవర్నెన్స్, ఏఐ, రోబోటిక్స్ లో పరస్పరం సహకరించుకునే విషయంపై చర్చిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (మీ సేవ) కార్పోరేషన్ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

వంద పడకల ఆసుపత్రి పనులను పర్యవేక్షించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

*జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్* *వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి* *_పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష_* పెద్దపల్లి, జులై 24, పున్నమి ప్రతినిధి: సీజనల్ వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆయుష్ ఆసుపత్రిని పరిశీలించి, నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల ఆసుపత్రి పనులు, నిర్మాణం పూర్తి చేసుకున్న తాత్కాలిక క్యాజువాలిటిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఆసుపత్రి వెనుక ఉన్న చిన్న సందు విస్తరించి, అక్కడి నుంచి పేషెంట్ తరలింపు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచనలు జారీ చేశారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నిర్దారణ పరీక్షలు నిర్వహించాలని, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా కేసులు తప్పనిసరిగా రిపోర్ట్ అయ్యేలా చూడాలని అన్నారు. ఈ తనీఖీలలో కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్.ఎం.ఓ డాక్టర్ విజయ్, నర్సింగ్ సూపరిండెంట్ జమున, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ యాదాద్రి భువనగిరి

జాతీయ చేనేత పురస్కారాలకు ఇద్దరు తెలంగాణ నేతన్నల ఎంపిక

*జాతీయ చేనేత పురస్కారాలకు ఇద్దరు తెలంగాణ నేతన్నల ఎంపిక* హైదరాబాద్, జులై 23, పున్నమి ప్రతినిధి: చేనేత రంగంలో 2024 సంవత్సరానికి గాను ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రం జాతీయ పురస్కారాలు ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 24 మందికి జాతీయ అవార్డులు వరించాయి. మొత్తం 24 అవార్డుల్లో 5 సంత్ కబీర్, 19 జాతీయ చేనేత అవార్డులున్నాయి. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు చేనేతలు గూడ పవన్, గజం నర్మద ఎంపిక అయ్యారు. వీరికి ఆగస్టు 7న న్యూఢిల్లీలో రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేయనున్నారు. అయితే వీరిద్దరి స్వస్థలం యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం కావడం గమనార్హం. కాగా ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు కేంద్ర అవార్డుకు ఎంపిక కావడం పట్ల పుట్టపాక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ చేనేత అవార్డులు-2024కు ఎంపికైన ఇరువురికి తెలంగాణ రాష్ట్రంలోని పలు చేనేత సంఘాలు, పద్మశాలి సంఘాల ప్రతినిధులు అభినందించారు.

తెలంగాణ మంచిర్యాల

సహారా కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన బాధితులు

*సహారా కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన బాధితులు* మంచిర్యాల, జులై 22, పున్నమి ప్రతినిధి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సహారా ఇండియా కార్యాలయం ముందు మంగళవారం ప్లే కార్డ్స్ పట్టుకొని డిపాజిట్ దారులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ సింగరేణి విశ్రాంత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, అసంఘటిత రంగంలో పనిచేసే కూలీలు తమ రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా కూడబెట్టిన లక్షలాది రూపాయల డబ్బులను భవిషత్తులో తమ కూతుర్ల పెళ్లిళ్ల కోసం, కొడుకుల చదువుల కోసం, చిన్న ఇల్లు కట్టుకోవడానికి ఆసరాగా ఉంటాయనే ఉద్దేశ్యంతో సహారా ఇండియాలో డిపాజిట్ చేశామని తెలిపారు. డిపాజిట్ చేసిన పాలిసీలు మెచ్యూరిటీ పూర్తి అయ్యి సంవత్సరాలు గడుస్తున్నా, చెప్పులు అరిగేలా సహారా ఆఫీస్ ల చుట్టూ తిరిగినా డిపాజిట్ డబ్బులను చెల్లించడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నేడు కార్యాలయం ముందు ఆందోళనకు దిగామని, తమ డిపాజిట్ లను వెంటనే చెల్లించకపోతే తమ కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మ హత్యలు చేసుకోవడమే శరణ్యమని బాధితులు విలపించారు. సహారా బాధితుల సమస్యలపై స్థానిక ప్రజా ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలు స్పందించి న్యాయం చేసే విధంగా కృషి చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ సందర్భంగా సహారా కార్యాలయంలోని సిబ్బందికి సహారా ఇండియా పాలిసీలు మెచ్యూరిటీ పూర్తయిన ఖాతాదారులకు వెంటనే డబ్బులు చెల్లించే విధంగా కృషి చేయాలని, లేని ఎడల సహారా ఇండియా కార్యాలయాల ముందు శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని బాధితులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సహారా బాధితుల సంఘం నాయకుడు, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, సహారా బాధితులు దండు రాజమౌళి, జి.ప్రభాకర్, ఎం. కాంతయ్య, పి. చంద్రకాంత్, ఎస్. భీమేష్, బాలు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

భాద్యతగా పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది: సీపీ అంబర్ కిషోర్ ఝా

*భాద్యతగా పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది* *_రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా_* రామగుండం, జులై 22, పున్నమి ప్రతినిధి: వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి జోన్ పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సీపీ కి స్టేషన్ పోలీస్ అధికారులు పుష్ప గుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసుల వివరాలను తెలుసుకొని పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. స్టేషన్ లోని పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి భౌగోళిక పరిస్థితులు, ముఖ్యమైన ప్రదేశాలు, ఈ ప్రాంతంలోని మావోయిస్టులు, వారి కుటుంబ వివరాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఏవిదంగా నియంత్రణ చేయాలనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ స్టేషన్ రికార్డ్స్, హిస్టరీ షీట్స్, మండల భౌగోళిక స్థితి, నేరాల నమోదు, కేసుల స్థితిగతులు, కోర్టు క్యాలెండర్, సాంకేతికత మొదలగు వాటిని పరిశీలించారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాలని సిబ్బందిని ఆదేశించారు. పారదర్శకంగా పోలీసింగ్ ఉండాలని ప్రజలకు పోలీసు సేవలను వేగంగా అందించాలని సిబ్బందికి తెలిపినారు. గంజాయి రవాణా, వినియోగం నిరోధించేలా బాధ్యతగా పని చేయాలని అన్నారు. పెట్రోలింగ్ పెంచాలని, డయల్ 100 కాల్స్ పై సిబ్బంది వేగంగా స్పందించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు పని చేయాలని అన్నారు. సైబర్ నేరాలు జరగకుండా ప్రజలు సైబర్ మోసాలకు గురి కాకుండా అవగాహన కల్పించాలని కోరారు. భాద్యతగా పని చేసే సిబ్బందికి రీవార్డ్స్, ప్రోత్సాహకాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతో పాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులకు స్పందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, బిట్లు, పెట్రోలింగ్ పగడ్బందీగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ తెలిపారు. ఇదే క్రమంలో పోలీస్ కమిషనర్ అధికారులతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఇంచార్జ్ ఏసీపీ శ్రీనివాస్, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పోత్కపల్లి ఎస్ఐ డి. రమేష్, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ ఐ వెంకటేష్, సిసి హరీష్ ఉన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 రూపాయల 50 పైసలకు ఇటుక సరఫరా

*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 రూపాయల 50 పైసలకు ఇటుక సరఫరా* *_ధర నిర్ణయంపై ప్రకటన విడుదల చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష_* పెద్దపల్లి, జులై 22, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకలను ఒక్కో ఇటుక 5 రూపాయల 50 పైసలకు సరఫరా చేసేందుకు ఇటుక బట్టీల యాజమానులు నిర్ణయించారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటుక బట్టీల యాజమానులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి పెద్దపల్లి జిల్లాలో ఉన్న 102 ఇటుక బట్టీల నుంచి తక్కువ ధరకు ఇటుక సరఫరా చేయాలని వారిని ఒప్పించడం జరిగింది. మొదటి విడత కింద పెద్దపల్లి జిల్లాకు ప్రభుత్వం 9 వేల 421 ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు చేయగా ఇప్పటివరకు 6 వేల 18 ఇండ్లను లబ్ధిదారులకు మంజూరు చేసామని, 3 వేల 847 గృహాలకు మార్కింగ్ చేసి బేస్మెంట్ పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 12, 000 ఇటుకల అవసరం అవుతాయని, ఒక్కో ఇటుక 5 రూపాయల 50 పైసలకు సరఫరా చేసేందుకు జిల్లాలో ఉన్న 102 ఇటుక బట్టీల యాజమాన్యుల సమావేశంలో నిర్ణయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి, శ్రీరాంపూర్, పాలకుర్తి, కమాన్ పూర్ మండలాల్లోని లబ్ధిదారులకు పెద్దపల్లి మండలంలో తయారు చేసిన ఇటుక బట్టీల నుంచి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లోని లబ్ధిదారులకు సుల్తానాబాద్ మండలంలో తయారుచేసిన ఇటుక బట్టీల నుంచి సరఫరా అవుతుందని అన్నారు. ధర్మారం మండలంలోని ఇటుక బట్టీలు ధర్మారం మండలానికి, రామగిరి, రామగుండం మండలాల్లో తయారు అయ్యే ఇటుక బట్టీల నుంచి రామగిరి, మంథని ముత్తారం, మంథని మండలాలకు ఇటుకల సరఫరా అవుతాయని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అవసరమైన ఇటుకలను ప్రతి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి ద్వారా ఒకేసారి లిఫ్ట్ చేయుటకు వాహన సంఖ్యతో పర్మిట్ లెటర్ ఎంపీడీవో ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను పూర్తి స్థాయిలో త్వరగా నిర్మించుకోవాలని, ఈ ప్రక్రియను పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి, పిడి హౌసింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

రేపటి రాష్ట్ర వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపు

రేపటి రాష్ట్ర వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపు మంథని, జులై 22, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జూలై 23న నిర్వహించే రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయడానికి విద్యార్థి లోకమంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ, డీఈవో పోస్టులను భర్తీ చేయాలని,బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని,అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి.ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని, విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని, ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ లతో ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యా రంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు బందెల రాజకుమార్, నాయకులు రజినీకాంత్, గణేష్, రోహిత్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు..

ఆదిలాబాదు కరీంనగర్ కామారెడ్డి తెలంగాణ నాగర్‌కర్నూల్ పెద్దపల్లి మెదక్ వరంగల్ హైదరాబాద్

నేడు తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్

*నేడు తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు అలర్ట్* హైదరాబాద్‌, జులై 21, పున్నమి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలపై విస్తృత వర్షాల ప్రభావం ఉండనున్నట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్‌ నగరంతోపాటు మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్‌, నల్గొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆదివారం రాత్రి హైదరాబాద్‌ లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. నగరంలోని కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్‌పేట్, అమీర్‌పేట్, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షాల దృష్ట్యా జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్‌, విద్యుత్‌, రెస్క్యూ విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో జాతీయ విపత్తు నిర్వహణ బృందాన్ని కూడా సిద్ధంగా ఉంచారు. నదులు, వాగులు, చెరువుల సమీపాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాలు మరో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్‌ పై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకూడదనీ, ఎగువ ప్రాంతాల నుంచి నీరు వస్తే అప్రమత్తంగా ఉండాలనీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనీ, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని సంబంధిత అధికారులు ముందస్తు సూచనలు జారీ చేశారు.

తెలంగాణ హైదరాబాద్

ప్రభుత్వం తరుఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వం తరుఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, జులై 20, పున్నమి ప్రతినిధి: ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం హరిబౌలీలోని శ్రీ అక్కన్న మాదన్న ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజలందరికీ ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ బోనాలు, లాల్ దర్వాజా బోనాలు కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాదు, యావత్ దేశానికి, ప్రపంచానికి తెలంగాణ జీవన విధానం, పల్లె సంస్కృతి, సాంప్రదాయాలను, ఇక్కడి ప్రజల స్ఫూర్తిని చాటి చెప్పే గొప్ప ఉదాహరణలు అని అన్నారు. జంట నగరాల్లో రాష్ట్ర పండుగగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున రూ.20 కోట్లు కేటాయించామని, నగరంలోని 2783 ఆలయాలకు చెక్కుల రూపంలో నిధులను అందజేసినట్లు ప్రకటించారు. కేవలం ఒక ప్రకటన కాదనీ, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేసే దృఢ సంకల్పం అని అన్నారు. ఆ అమ్మవారి చల్లని దీవెనలతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో, ఐటీ, పరిశ్రమల రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిపేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ సంక్షేమ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

జూలై 24 జాబ్ మేళా నిర్వహణ…. పెద్దపల్లి జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతిరావు

జూలై 24 జాబ్ మేళా నిర్వహణ…. పెద్దపల్లి జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతిరావు పెద్దపల్లి, జులై 19, పున్నమి ప్రతినిధి: నిరుద్యోగ యువతీ, యువకులకు పెద్దపల్లి జిల్లా నందు కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ లో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 24న గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రూమ్ నెం.225 పైన నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ సంస్థలో (67) పోస్టులకు ఇంటర్యులు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి పోస్టుల పేరు సేల్స్ ఎక్సిక్యూటివ్ (60) ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (04), హెచ్ ఆర్ మేనేజర్స్ (02) ఆఫీస్ బాయ్ (01) లు ఖాళీలు ఉన్నాయని ఇట్టి పోస్టులకు విద్యా అర్హత ఎస్ఎస్సి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ లేదా ఎంబీఏ, ఆపై చదివిన వారు అర్హులని, వీరి వయస్సు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉండాలని తెలిపారు. ఇట్టి పోస్టులకు యువతీ, యువకులు అర్హతలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు జూలై 24న ఉదయం 11 గంటలకు సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం రూమ్ నెం.225 పైన గల జిల్లా ఉపాధి కార్యాలయం, వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9391420932, 8985336947, 8121262441 నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతిరావు ఆ ప్రకటనలో తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.