Thursday, 7 May 2026

Tag: Telangana

తెలంగాణ పెద్దపల్లి

ఆగస్టు 5 నుంచి 8 వరకు పెద్దపల్లి కలెక్టరేట్ లో ఆధార్ అప్డేట్ కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు…

ఆగస్టు 5 నుంచి 8 వరకు పెద్దపల్లి కలెక్టరేట్ లో ఆధార్ అప్డేట్ కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు… పెద్దపల్లి, జులై 18, పున్నమి ప్రతినిధి: ఆగస్టు 5 నుంచి 8 వరకు కలెక్టరేట్ లో ఆధార్ అప్డేట్ కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా ఆధార్ కార్డు పొందేందుకు మీసేవ ద్వారా అడ్రస్ తో జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్, తల్లి లేదా తండ్రి అప్ డేట్ చేసిన ఆధార్ కార్డు ఉండాలని అన్నారు. ఆధార్ కార్డులో అడ్రస్ మార్పు కోసం ఓటర్ ఐడి లేదా పాస్ పోర్ట్ లేదా నివాస సర్టిఫికెట్, బ్యాంకు పుస్తకం/ పోస్టల్ బుక్ తో సహా అటెస్టడ్ దరఖాస్తు ఫారం ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఆధార్ కార్డులు పేరు స్పెల్లింగ్ పొరపాట్ల సవరణకు ఓటర్ ఐడి లేదా పాస్ పోర్ట్ లేదా ప్యాన్ కార్డు లేదా ఎస్.ఎస్.సి మార్కుల మెమో లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా మైనర్ ఐతే బర్త్ సర్టిఫికెట్ ఉండాలని, పెళ్లి తర్వాత పేరు మార్పు కోసం సబ్ రిజిస్ట్రార్ జారీ చేసిన మ్యారేజ్ సర్టిఫికెట్, పెళ్లి ఫోటో, ఇతర గుర్తింపు కార్డులు ఉండాలని, పూర్తిగా పేరు మార్పు కోసం గెజిటెడ్ చేసి ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆధార్ కార్డు లో డేట్ అఫ్ బర్త్ కరెక్షన్ కోసం బర్త్ సర్టిఫికెట్, 21 సంవత్సరాల పైబడిన వారికి ఫోటో తో కూడిన మార్కుల మెమో లేదా ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలని అన్నారు. ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ కోసం బయట 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, ఈ క్యాంపులో అవసరం లేదని ఉచితం అన్నారు. ఆధార్ అప్డేషన్ అవసరం ఉన్నవాళ్లు ఈ 15 రోజుల వ్యవధిలో కావలసిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటుచేసే ఆధార్ అప్డేట్ క్యాంపును అవసరమైన ప్రజలు, ఉద్యోగులు వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ రంగారెడ్డి హైదరాబాద్

రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తి చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తిచేయాలి- మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, జులై 18, పున్నమి ప్రతినిధి : బాచుపల్లి – గండి మైసమ్మ వరకు 6 వరసల రోడ్డు, బహుదూర్ పల్లి నుంచి దూలపల్లి మీదుగా కొంపల్లి వరకు సాగే రహదారి నిర్మాణాలకు అటవీ భూమి బదలాయింపు పై రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ సువర్ణ, హెచ్ ఎండీఎ కమిషనర్ సర్ఫరాజ్ నవాజ్, జిహెచ్ ఎంసీ అదనపు కమిషనర్, కొంపల్లి మున్సిపల్ కమిషనర్, మేడ్చెల్స్ అదనపు కలెక్టర్, తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూమి, ఫారెస్టేతర స్థలాల భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పనులకు శంకుస్థాపన జరిగే విధంగా యుద్ధ ప్రాతిపదికన నిర్దేశించిన పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. అటవీ శాఖకు చెందిన 19 ఎకరాల భూమి అప్పగింతకు సంబంధించి మొదటి దశ ఫార్మాటిలిటీలన్నీ గడువులోగా అయ్యేలా చూడాలని ఆదేశించారు. స్థానికులకు చెందిన భూముల సేకరణ, నష్టపరిహారం చెల్లింపులో మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు. భూసేకరణకు పరిహారంగా ఇచ్చే నిధులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే 8 శాసన నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి అన్నారు. బహదూర్ పల్లి నుంచి కొంపల్లి రోడ్డులో అటవీ భూమి బదలాయింపునకు సంబంధించి స్టేజ్-1 ప్రక్రియ పూర్తయిందని ఫారెస్ట్ అధికారులు శ్రీధర్ బాబుకు వివరించారు. బాచుపల్లి – గండి మైసమ్మ రోడ్డు నిర్మాణానికి అవసరమైన అటవీభూమి ట్రాన్సఫర్ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. సుభాష్ నగర్ పైపు లైన్, సెయింట్ యాన్స్ స్కూల్ రోడ్డు నిర్మాణం పనులను కూడా పూర్తి చేయాలని రెవిన్యూ, మున్సిపల్ అధికారులను శ్రీధర్ బాబు ఆదేశించారు.

తెలంగాణ పెద్దపల్లి

బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం

బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం *_పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష_* పెద్దపల్లి, జులై 17, పున్నమి ప్రతినిధి: 2025-26 సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో 3వ, 5వ, తరగతుల్లో ప్రవేశం కొరకు పెద్దపల్లి జిల్లాలోని గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు జూలై 26 లోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ నందు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు మొత్తము (5) సీట్లు కేటాయించడం జరిగిందని , వీటిలో 3 సీట్లు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయబడ్డాయని తెలిపారు. మూడవ తరగతిలో ఎరుకుల బాలురకు ఒకటి, ఐదవ తరగతిలో గోండు నాయక్ బాలురకు ఒక సీట్ పెండింగ్ ఉందని వీటికోసం ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అర్బన్ ప్రాంతంలో రెండు లక్షలు, రూరల్ ప్రాంతంలో ఒక లక్షా 50 వేలు ఉండాలని, ధ్రువీకరణ పత్రాలు ఆదాయం, కులం, బర్త్, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ 2 సైజ్ ఫోటోలను జత చేసి పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 26 లోగా కరీంనగర్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని, ఇతర వివరాలకు ఫోన్ నెంబరు 9652118867 నందు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

జాతీయ అంతర్జాతీయ తెలంగాణ

ఇంధన భద్రతపై మంత్రి శ్రీధర్ బాబు పలు కీలక ప్రతిపాదనలు

న్యూఢిల్లీ, జులై 17, పున్నమి ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని భారత మండపం ‘ఉర్జా మంథన్ 2025’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భారతదేశ ఇంధన భద్రత, సహకార విధానాలపై చర్చ జరిగింది. దేశంలోని 22 రాష్ట్రాల నుంచి మంత్రులు హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ తరఫున హాజరైన మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నడిపించడంలో కేంద్ర, రాష్ట్రాల పరస్పర సహకారం అవసరాన్ని నొక్కి చెప్పారు. తెలంగాణ నాయకత్వాన్ని హైలైట్ చేస్తూ.. రాష్ట్ర క్లీన్, గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 కింద తీసుకున్న కీలకమైన చర్యలను వివరించారు. బయో ఇంధనాలు, కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ), సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్‌వర్క్‌లపై దృష్టి సారించి.. ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధర్ బాబు పలు కీలక ప్రతిపాదనలు చేశారు. నగర గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ల విస్తరణలో హైదరాబాద్ నగరమే కాకుండా, ద్వితీయ శ్రేణి పట్టణాలలో సీజీడీ నెట్‌వర్క్‌లను వేగవంతం చేయాలనీ, రాష్ట్ర వ్యాప్తంగా సమానమైన ఇంధన లభ్యతను పెంచాలని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. బీజీఎల్‌లో మరిన్ని సీజీఎన్జీ స్టేషన్లు, పెట్టుబడులు, సీఎన్జీ స్టేషన్ల సంఖ్యను పెంచాలనీ, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్‌లో పెట్టుబడులను పెంచాలనీ, తద్వారా తెలంగాణలో పట్టణ, సెమీ-అర్బన్ పైప్డ్ గ్యాస్ మౌలిక సదుపాయాల విస్తరణకు వీలు కల్పించాలని శ్రీధర్ బాబు కేంద్రాన్ని కోరారు. ఎల్ఎన్జీ, సీఎన్జీ టెర్మినల్స్‌కు నిధులు, పెరుగుతున్న పారిశ్రామిక, దేశీయ అవసరాలను తీర్చడానికి తెలంగాణలో సీఎన్జీ, ఎల్ఎన్జీ టెర్మినల్స్‌ను స్థాపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహ నిధుల వినియోగాన్ని మంత్రి ప్రతిపాదించారు. తెలంగాణ వ్యవసాయ వ్యర్థాల సామర్థ్యాన్ని పెంచుకోవడం, తెలంగాణలో గణనీయమైన వ్యవసాయ వ్యర్థాల ఉత్పత్తిని ఉదహరిస్తూ రాష్ట్రంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తి ఉపయోగించని సామర్థ్యాన్ని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం వీటిలో పెట్టుబడి పెట్టాలని శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. సీబీజీ, వ్యర్థాల నుంచి శక్తి సాంకేతికతలు, వ్యవసాయ సంపన్న ప్రాంతాలలో కొత్త సీబీజీ యూనిట్లను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. సాటాట్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటి పథకాల కింద క్లీన్ ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలను పెంపొందించడానికి ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందించాలని మంత్రి వ్యాఖ్యానించారు. తూర్పు, పశ్చిమ పైప్‌లైన్ సినర్జీ, తూర్పు, పశ్చిమ గ్యాస్ పైప్‌లైన్ వెంబడి తెలంగాణ వ్యూహాత్మక స్థానాన్ని మంత్రి శ్రీధర్ బాబు హైలైట్ చేశారు. తక్కువ ఖర్చుతో గ్యాస్ ఆధారిత ఇంధన పారిశ్రామిక వినియోగాన్ని పెంచడానికి మౌలిక సదుపాయాలను విస్తరించడంలో కేంద్రం నేతృత్వంలోని మరిన్ని పెట్టుబడులను ప్రతిపాదించారు. ఇంధన భద్రతపై దృష్టి, ఇంధన రంగంలో దేశంలో కీలక భాగస్వామిగా తెలంగాణ స్థిరమైన, సమగ్ర ఇంధన అభివృద్ధికి జాతీయ నమూనాగా మారడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. ప్రోయాక్టివ్ విధానాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక సంసిద్ధతతో, భారతదేశం క్లీన్ ఎనర్జీ పరివర్తనకు నాయకత్వం వహించడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ అంతర్జాతీయ తెలంగాణ

తెలంగాణలో కొత్తగా 4 రైల్వే మార్గాలు..

*తెలంగాణలో కొత్తగా 4 రైల్వే మార్గాలు..* *రీజినల్ రింగ్ రైలు అనుమతుల కోసం విజ్ఞప్తి..* న్యూఢిల్లీ, జులై 17, పున్నమి ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారాన్ని కోరుతూ కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కీలక భేటీ అయ్యారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయని పేర్కొంటూ, రాష్ట్రంలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రైల్ భవన్‌లో అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల అనుసంధానం, పారిశ్రామిక, వ్యవసాయక ఎగుమతులు, దిగుమతులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నూతన రైలు మార్గాలకు సంబంధించి పలు ప్రతిపాదనలను అందించారు. ఇందులో భాగంగా వికారాబాద్ – కృష్ణా (122 కి.మీ. – రూ.2,677 కోట్లు), కల్వకుర్తి – మాచర్ల (100 కి.మీ. – రూ.2 వేల కోట్లు), డోర్నకల్ – గద్వాల (296 కి.మీ. – రూ.6,512 కోట్లు), డోర్నకల్ – మిర్యాలగూడ (97 కి.మీ. – రూ.2,184 కోట్లు) మార్గాలను వంద శాతం రైల్వే శాఖ వ్యయంతో మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణలో రైల్వే అనుసంధానతను పెంచేందుకు నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు, దీనికి రైల్వే బోర్డు ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. సుమారు రూ.8 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజినల్ రింగ్ రైలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెరగడంతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, గ్రామీణ పేదరికం తగ్గి పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆయన వివరించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో ఏర్పాటు చేయతలపెట్టిన హైటెక్ ఎలక్ట్రానిక్ పార్కుకు సంబంధించి EMC 2.0 పథకం కింద తెలంగాణ అభ్యర్థనను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రీజినల్ రింగ్ రోడ్డు సమీపంలో ఒక నూతన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా.. తెలంగాణలో ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరిస్తూ, ప్రతిపాదిత అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ (ASIP) ప్రాజెక్ట్, మైక్రో LED డిస్‌ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్‌కు తక్షణ ఆమోదం తెలపాలని రేవంత్‌రెడ్డి కోరారు. సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచేందుకు ఈ ప్రాజెక్టులు అత్యంత కీలకమని ఆయన చెప్పారు. అంతేకాకుండా.. హైదరాబాద్ డ్రైపోర్ట్ నుంచి బందర్ ఓడరేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. ఔషధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తుల ఎగుమతులు, పలు దిగుమతులకు ఈ మార్గం అత్యంత కీలకమని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ఆపరేషన్స్‌ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కూడా రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు భద్రత, వేగవంతమైన సేవలు అందించేందుకు ఇది అవసరమన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

అంతర్గాం మండలంలో విస్తృతంగా పర్యటించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

*అంతర్గాం మండలంలో విస్తృతంగా పర్యటించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అంతర్గాం, జులై 17, పున్నమి ప్రతినిధి: పాఠశాల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. అంతర్గాం మండలం మద్దిరాల గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు, అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, పోట్యాల గ్రామంలోని ఎంపీపీఎస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బ్రాహ్మణపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, గోలివాడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత కల్పించాలని, పాఠశాల ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలు పెరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. పాఠశాలల్లోని పిల్లలకు విష జ్వరాలు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ‌పాఠశాలలకు ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, రాబోయే 5 సంవత్సరాల పాటు ఎటువంటి అవసరాలు లేకుండా పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని, వాటిని వెను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మద్దిరాల గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారం అధికారులు అందించాలని కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట అంతర్గాం ఎంపీడీఓ వేణుమాధవ్, హౌసింగ్ ఈఈ రాజేశ్వర్, హౌసింగ్ డీఈ దస్తగిరి, పంచాయతీ రాజ్ డీఈ అప్పల నాయుడు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

జులై 21 లోపు నైపుణ్య శిక్షణ కోసం ఎంబీసి అభ్యర్థుల దరఖాస్తులకు ఆహ్వానం

*జులై 21 లోపు నైపుణ్య శిక్షణ కోసం ఎంబీసి అభ్యర్థుల దరఖాస్తులకు ఆహ్వానం* *_పెద్దపల్లి జిల్లా బీసి అభివృద్ధి అధికారి జే.రంగారెడ్డి_* పెద్దపల్లి, జులై 17, పున్నమి ప్రతినిధి: ఈ నెల 21 లోపు నైపుణ్య శిక్షణ కోసం ఆసక్తి, అర్హత గల ఎంబీసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జె.రంగారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంబీసీ నిరుద్యోగ యువతీ యువకుల కు వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమం 4 రోజుల పాటు హైదరాబాద్ లో అందించడం జరుగుతుందని అన్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు భోజన సదుపాయం, టీఏ, వసతి కల్పించడం జరుగుతుందని అన్నారు. అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల వయసు లోపు ఉండాలని, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలని, ఎంబిసి 36 కులాల వారికి మాత్రమే ఈ శిక్షణ కార్యక్రమం అందుతుందని, వీరి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు ఉండాలని అన్నారు. ఆసక్తి, అర్హత కల అభ్యర్థులు తమ దరఖాస్తులను జూలై 21 లోపు tgobmms.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకొని, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, విద్యార్హత సర్టిఫికెట్లతో దరఖాస్తు జత చేసి పెద్దపల్లి కలెక్టరేట్ లో ఉన్న బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో జూలై 22 లోపు సమర్పించాలని, నిరుద్యోగ ఎంబీసీ యువతీ యువకులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే. రంగారెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ మెదక్

నర్సాపూర్: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

నర్సాపూర్: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నర్సాపూర్, జులై 17, పున్నమి ప్రతినిధి: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, కేంద్రంలోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆహార భద్రత, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు డా. వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల బాగోగులే తమ ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉండి, ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేర్చుతుందనీ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి లబ్ధిదారుడు 600 స్క్వేర్ ఫీట్స్ లోపు ఇంటిని నిర్మించుకోవాలనీ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. మహిళల శక్తి, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తూ, ఇందిరా మహిళ శక్తి ద్వారా మహిళలు ఆర్థికంగా ముందుకు వస్తున్నారని, స్వయం శక్తితో, స్వయం ఉపాధిలో మహిళలు రాణిస్తూ చిన్నతరహా వ్యాపారాలు నిర్వహిస్తూ తమ కుటుంబాలను ఆదుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

తెలంగాణ

తెలంగాణ: ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఖరారు

*తెలంగాణ: ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఖరారు* హైదరాబాద్, పున్నమి ప్రతినిధి; తెలంగాణ ప్రభుత్వం జిల్లా పరిషత్ స్థానాలు, మండల పరిషత్ స్థానాలను ఖరారు చేసి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జెడ్పీటీసీ స్థానాలు మొత్తం 566 ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలు 5,773 గా ఖరారు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సంఖ్యను ఫైనల్ చేసింది. 71 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో విలీనం కావడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 5,817 నుండి 5,773 కు తగ్గింది. ఈ మార్పు ఇటీవల ఇంద్రేశం, జిన్నారం వంటి కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు కారణంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ అందించాలని నిర్ణయించారు. ఈ రిజర్వేషన్ సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థానాలకు వర్తిస్తుంది. బీసీ రిజర్వేషన్లను పెంచడానికి ఆర్డినెన్స్ జారీ చేయడం కోసం గవర్నర్ కు పంపారు. గవర్నర్ సంతకం కాగానే ఈ స్థానాలకు రిజర్వేషన్ ఖరారు చేస్తారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పంచాయతీ రాజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు ఎన్నికల ప్రక్రియను అధికారులు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. చివరిసారిగా 2019లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. 2019 ఎన్నికలలో, మొత్తం 538 జెడ్పీటీసీ లు, 5,817 ఎంపీటీసీ ల కోసం ఎన్నికలు నిర్వహించారు. ఈ సారి మున్సిపాలిటీలు పెరిగినందున కౌన్సిలర్ సీట్లు పెరుగుతాయి. భారత రాజ్యాంగంలో 73, 74 వ సవరణల ద్వారా పంచాయతీ రాజ్ ఎన్నికలు జరుగుతాయి. ఈ వ్యవస్థ గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో పాలకవర్గాలను కలిగి ఉంటుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజా ప్రతినిధులు ఉంటారు. ప్రతి మండలం ఒక జెడ్పీటీసీ నియోజకవర్గంగా పరిగణిస్తారు. జెడ్పీటీసీ సభ్యుడు ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నికవుతారు. జిల్లా పరిషత్‌లలో మైనారిటీల నుండి ఇద్దరు వ్యక్తులు జెడ్పీటీసీ లలో కో-ఆప్టెడ్ సభ్యులుగా నియమించవచ్చు. ఎంపీటీసీ సభ్యులు కూడా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నికవుతారు. వీరు మండల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. 2019లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 534 జెడ్పీటీసీ స్థానాలలో 446, 5,800 ఎంపీటీసీ స్థానాలలో 3,556 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 76 జెడ్పీటీసీ, 1,377 ఎంపీటీసీ స్థానాలను గెలిచింది. బీజేపీ 8 జెడ్పీటీసీ, 211 ఎంపీటీసీ స్థానాలను గెలిచింది.

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పోస్టులు మoజూరు చేయండి

ముధోల్, జులై 16(తెలంగాణ పున్నమి ప్రతినిధి ):మండల కేంద్రమైన ముధోల్లో ప్రారంభం అయినా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2024 సంవత్సరంలో 54 విద్యార్థులు అడ్మిషన్స్ పొందారు. 8మంది అతిథి అధ్యాపకుల నియామకం జరిగింది. ఈ సంవత్సరo కుడా అధ్యాపకుల సహకారంతో ఫేస్ 3 వరకు 86 మంది విద్యార్థులు అడ్మిషన్స్ పొందారు. కానీ ఇప్పట్టి వరకు అధ్యాపకులకు పర్మిషన్ ఇవ్వలేదు. అడ్మిషన్స్ షెడ్యూల్ ప్రకారం క్లాస్ లు ప్రారంభమయ్యాయి. అధ్యాపకుల నియామకంలో ఆలస్యం వలన విద్యార్థులు నష్టపోతున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవోలో ముధోల్ డిగ్రీ కళాశాల కు పోస్ట్ లు మంజూరు చేయలేదు. దీని వలన ఇక్కడ ఉన్న అధ్యాపకులకు విద్యార్థులకు నష్టం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ కమీషనర్ వెంటనే స్పందించి ముధోల్ కళాశాలకు పోస్ట్ లు-నిధులు విడుదల చేయాలని ముధోల్ వీడీసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి ముధోల్ఎమ్మెల్యే రామారావు పటేల్ కి స్థానిక నాయకులు ఫోన్ చేసి వివరించారు. ఎమ్మెల్యే కూడా ఈ విషయం పై ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్య పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.