*తెలంగాణలో కొత్తగా 4 రైల్వే మార్గాలు..*
*రీజినల్ రింగ్ రైలు అనుమతుల కోసం విజ్ఞప్తి..*
న్యూఢిల్లీ, జులై 17, పున్నమి ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారాన్ని కోరుతూ కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కీలక భేటీ అయ్యారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయని పేర్కొంటూ, రాష్ట్రంలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రైల్ భవన్‌లో అశ్విని వైష్ణవ్‌ను కలిశారు.
తెలంగాణలోని వివిధ ప్రాంతాల అనుసంధానం, పారిశ్రామిక, వ్యవసాయక ఎగుమతులు, దిగుమతులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నూతన రైలు మార్గాలకు సంబంధించి పలు ప్రతిపాదనలను అందించారు. ఇందులో భాగంగా వికారాబాద్ – కృష్ణా (122 కి.మీ. – రూ.2,677 కోట్లు), కల్వకుర్తి – మాచర్ల (100 కి.మీ. – రూ.2 వేల కోట్లు), డోర్నకల్ – గద్వాల (296 కి.మీ. – రూ.6,512 కోట్లు), డోర్నకల్ – మిర్యాలగూడ (97 కి.మీ. – రూ.2,184 కోట్లు) మార్గాలను వంద శాతం రైల్వే శాఖ వ్యయంతో మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
తెలంగాణలో రైల్వే అనుసంధానతను పెంచేందుకు నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు, దీనికి రైల్వే బోర్డు ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. సుమారు రూ.8 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజినల్ రింగ్ రైలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెరగడంతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, గ్రామీణ పేదరికం తగ్గి పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆయన వివరించారు.
రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో ఏర్పాటు చేయతలపెట్టిన హైటెక్ ఎలక్ట్రానిక్ పార్కుకు సంబంధించి EMC 2.0 పథకం కింద తెలంగాణ అభ్యర్థనను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రీజినల్ రింగ్ రోడ్డు సమీపంలో ఒక నూతన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ముఖ్యంగా.. తెలంగాణలో ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరిస్తూ, ప్రతిపాదిత అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ (ASIP) ప్రాజెక్ట్, మైక్రో LED డిస్‌ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్‌కు తక్షణ ఆమోదం తెలపాలని రేవంత్‌రెడ్డి కోరారు. సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచేందుకు ఈ ప్రాజెక్టులు అత్యంత కీలకమని ఆయన చెప్పారు.
అంతేకాకుండా.. హైదరాబాద్ డ్రైపోర్ట్ నుంచి బందర్ ఓడరేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. ఔషధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తుల ఎగుమతులు, పలు దిగుమతులకు ఈ మార్గం అత్యంత కీలకమని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ఆపరేషన్స్‌ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కూడా రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు భద్రత, వేగవంతమైన సేవలు అందించేందుకు ఇది అవసరమన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


