Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Government activity

ఖమ్మం

గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

గణేష్న వరాత్రులు, నిమజ్జన ఏర్పాట్లపై బుధవారం ఖమ్మం కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అధికారులతో, ఉత్సవ సమితి భాద్యులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా మున్నేరు నదిలో నీరు లేకపోవడంతో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు లైన్‌మెన్‌ల ద్వారానే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. నిమజ్జనం రోజున మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జన పాయింట్ల వద్ద క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ దివాకర్ టి.ఎస్. సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఖమ్మం

ఖమ్మం చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. స్వాగతం పలికిన కలెక్టర్, కమిషనర్..

ఖమ్మం: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం ఖమ్మం నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ కమిషనర్ సునిల్ దత్ ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.

ఖమ్మం

విద్యార్థులపై మద్యం ఆరోపణలు.. బాలాజీనగర్‌లో కలకలం

ఖమ్మం నగరం లోని బాలాజీనగర్‌లోని ఓ పాఠశాల విద్యార్థులు మద్యం సేవించారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొందరు విద్యార్థులు వాటర్‌ బాటిళ్లలో మద్యం తీసుకొచ్చి తాగినట్లు ప్రచారం జరగడంతో విషయం కలకలంగా మారింది. ఈ ఘటనపై సోమవారం విద్యాశాఖ అధికారులు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే, విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవాలను నిర్ధారించకుండా ఆరోపణలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. అధికారులు చేపట్టిన విచారణలో అసలు విషయం వెలుగులోకి వస్తుందని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం

ఖమ్మం తీగల వంతెనకు ముహూర్తం.. రాకపోకలకు సెప్టెంబర్‌లో శ్రీకారం!

ఖమ్మం నగరానికి మణిహారంగా నిలవనున్న మున్నేరు తీగల వంతెన నిర్మాణం తుది దశకు చేరుకుంది. కాల్వొడ్డు–జలగంనగర్‌ మధ్య మున్నేరు నదిపై నిర్మిస్తున్న ఈ వంతెనకు ప్రభుత్వం రూ.180 కోట్లు మంజూరు చేసింది. టెండర్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం 2024 ఫిబ్రవరిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తొలుత పనులు నెమ్మదిగా సాగినా.. ప్రస్తుతం వేగం పుంజుకున్నాయి. వంతెన మొత్తం ప్రాజెక్టు పొడవు సుమారు 1.25 కిలోమీటర్లు కాగా, ప్రధాన కేబుల్‌ బ్రిడ్జి భాగం సుమారు 300 మీటర్లు ఉంటుంది. నాలుగు వరుసల రహదారి, సెంట్రల్‌ డివైడర్‌, ఫుట్‌పాత్‌లు, లైటింగ్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. 2026 జూన్‌ నాటికి పనులు సుమారు 85 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను మూడు నెలల్లో పూర్తి చేసి 2026 సెప్టెంబర్‌లో వాహన రాకపోకలకు వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వంతెన అందుబాటులోకి వస్తే ఖమ్మం నగరం–రూరల్‌ ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభం కానున్నాయి.

ఖమ్మం

SIR గడువు పెంపు

రాష్ట్రంలో కొనసాగుతున్న SIR (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 7 వరకు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఈ గడువు సెప్టెంబర్ 16తో ముగియాల్సి ఉంది. అయితే మరింత సమయం అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుధర్శన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించి గడువును పొడిగించింది. అనంతరం క్లెయిమ్స్, అభ్యంతరాల పరిశీలన పూర్తిచేసి నవంబర్ 9న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. గడువు పొడిగింపుతో అర్హులైన ఓటర్లు తమ వివరాలను సరిచేసుకోవడానికి, అభ్యంతరాలు నమోదు చేసుకోవడానికి మరింత అవకాశం లభించింది.

ఖమ్మం

దివ్యాంగ విద్యార్థులకు చేయూతలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానం

దివ్యంగా విద్యార్థులకు చేయూత అందించడంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం తెలిపారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు ‘అలీంకో’ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత పరికరాల ఎంపిక శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన వారికి ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు, వీల్‌చైర్లు తదితర పరికరాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ ఎంపిక ప్రక్రియకు తప్పనిసరిగా హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DEO సదానందం, CMO ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శిబిరానికి అవసరమైన పత్రాలతో హాజరై నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఖమ్మం

రాధాకృష్ణ స్ఫూర్తితో ఉపాధ్యాయులు పనిచేయాలి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు

ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ స్ఫూర్తిని కలిగి విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేయాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగార్జున ఫంక్షన్ హాల్‌లో TPTLF ఆధ్వర్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకుల సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు వృత్తిపట్ల అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో TPTLF రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఖమ్మం

హైదరాబాద్–ఖమ్మం ప్రయాణికులకు కొత్త బోర్డింగ్ పాయింట్లు

హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చే రిజర్వేషన్ ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బోర్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు ఖమ్మం డిపో మేనేజర్ శివ ప్రసాద్ తెలిపారు. ప్రయాణికులు తమకు సమీపంలోని పాయింట్ నుంచి బస్సు ఎక్కేలా ఈ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. MGBS, నల్గొండ క్రాస్ రోడ్డు, కొత్తపేట క్రాస్ రోడ్డు, అష్టలక్ష్మి టెంపుల్, ఎల్‌బీనగర్ మెట్రో పిల్లర్ నంబర్ 1665, పనామా, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, రామోజీ ఫిల్మ్ సిటీ, ORR ఎగ్జిట్ సమీపంలోని సంపూర్ణ హోటల్, అబ్దుల్లాపూర్‌పేట్ ప్రాంతాల్లో బోర్డింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమకు అనుకూలమైన బోర్డింగ్ పాయింట్‌ను ఎంచుకుని ప్రయాణించవచ్చని ఆయన సూచించారు.

ఖమ్మం

ఖమ్మంలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 1.75 లక్షల అనామలీస్ ఓటర్లకు నోటీసులు: కలెక్టర్ దివాకర్ టి ఎస్ వెల్లడి

ఖమ్మం జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ తెలిపారు. జిల్లాలో మొత్తం 10,85,927 మంది ఓటర్లు నమోదయ్యారని వెల్లడించారు. ఇందులో మ్యాపింగ్ కాని, అనామలీస్‌గా గుర్తించిన 1,75,858 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 1,75,841 నోటీసులను రూపొందించి, 1,32,817 మందికి అందజేసినట్లు వివరించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు సంబంధించిన విచారణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే 14,680 మంది ఓటర్ల హియరింగ్ పూర్తయ్యిందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రూపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దివాకర్ టి.ఎస్ స్పష్టం చేశారు.

ఖమ్మం

ROFR పట్టాదారులకు గుడ్‌న్యూస్.. దరఖాస్తు రోజే బోర్‌వెల్ అనుమతి!

ఖమ్మం జిల్లాలోని ROFR పట్టా భూముల యజమానులు తమ భూముల్లో బోర్‌వెల్ తవ్వుకునేందుకు అనుమతులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. తెలిపారు. దరఖాస్తుదారులు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, దరఖాస్తు చేసుకున్న రోజే అనుమతి ఇచ్చేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ROFR పట్టాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నిర్ణీత తేదీన సంబంధిత మండల కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.