Monday, 20 April 2026

Blog

రాజన్న సిరిసిల్ల

అకస్మాత్తు ప్రమాదంలో మృతిచెందిన మహిళ కుటుంబానికి ముదిరాజ్ సంఘం చేయూత

ముస్తాబాద్, ఏప్రిల్ 16 , పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండల కేంద్రంలోని ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గూడెం గ్రామానికి చెందిన రాళ్లపాట లక్ష్మీ గారు దుబ్బాక ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని కలిగించింది. మృతురాలి కుటుంబం చాలా పేదరికంలో ఉండి, ఇల్లు మరియు భూమి లేని కటిక పేదరికంలో ఉంటూ ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి చెందిన మహిళ మృతి చెందిన నేపథ్యంలో ముస్తాబాద్ మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం స్పందించింది. మృతురాలి కూతురు పోతిరెడ్డి పద్మ, అల్లుడు పోతిరెడ్డి దేవయ్య గారిని పరామర్శించి, వారి తల్లి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సంఘం అధ్యక్షుడు పిట్ల విట్టల్ గారి ఆధ్వర్యంలో రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జాల బిక్షపతి, గీస బిక్షపతి (సి.డబ్ల్యూ.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు), పిట్ల రాజు (అవునూరి గ్రామ అధ్యక్షుడు), బోయిన్ గంగాధర్, దేవరాజు గోపాల్, వెంకట్, శ్రీనివాస్, సుద్దాల శ్రీనివాస్, వెంకటేష్, బోయిన్ బిక్షపతి, గోపన్న గారి వెంకట్, జక్కుల గిరి తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ సంక్షేమ సంఘం సభ్యుల సమక్షంలో ఈ ఆర్థిక సహాయంను అందజేయడం జరిగింది.

అన్నమయ్య

మల్లెంపల్లెలో గంగమ్మ తల్లి పూజలు ఘనంగా – ఐక్యతతో ఊరంతా కలిసి పొంగళ్ళు సమర్పణ

తిరుపతి జిల్లా చిట్వేలు మండలం మల్లెంపల్లె గ్రామంలో గురువారం నాడు గంగమ్మ తల్లి పూజలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామస్థులందరూ కులమత భేదాలు లేకుండా ఐకమత్యంతో ఒక్కటై గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా పొంగళ్ళు పెట్టి తమ భక్తిని చాటుకున్నారు. గ్రామం అంతటా పండుగ వాతావరణం నెలకొని, ప్రతి ఇంట్లోనూ ఆనందం వెల్లివిరిసింది.ఉదయం వేళ నుంచే గ్రామంలో పూజా కార్యక్రమాలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మహిళలు ఇంటింటా ముంగిట మగ్గులతో ముగ్గులు వేసి, పూలతో అలంకరించారు. పండుగకు తగిన విధంగా గ్రామ దేవాలయం శోభాయమానంగా అలంకరించబడింది. భక్తులు కొత్త బట్టలు ధరించి కుటుంబ సమేతంగా దేవాలయానికి తరలివచ్చి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామంలోని మహిళలు కలసికట్టుగా పొంగళ్ళు వండడం ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పాలు, బెల్లం, కొత్త బియ్యంతో సంప్రదాయ పద్ధతిలో వండిన పొంగళ్ళను గంగమ్మ తల్లికి సమర్పించి గ్రామాభివృద్ధి, వర్షాభివృద్ధి, కుటుంబాల సౌఖ్యం కోసం ప్రార్థనలు చేశారు. పూజలు నిర్వహించే సమయంలో భక్తులు హారతులు ఇస్తూ, మంగళహారతులతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉద్ధృతం చేశారు. గ్రామ పెద్దలు, యువకులు కలిసి పూజా కార్యక్రమాల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు. శ్రద్ధతో ఏర్పాట్లు చేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం విజయవంతంగా పూర్తిచేశారు. చిన్నారులు కూడా ఆనందంగా పాల్గొని పండుగకు మరింత ఉత్సాహాన్ని తెచ్చారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. అందరూ కలిసి ప్రసాదాలను పంచుకోవడం ద్వారా పరస్పర స్నేహభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఐక్యత, సౌభ్రాతృత్వం, సామాజిక సమగ్రత స్పష్టంగా ప్రతిఫలించాయి.ఈ వేడుక గురించి గ్రామ పెద్దలు మాట్లాడుతూ, “ఇలాంటి సంప్రదాయ పూజలు గ్రామ ప్రజలను ఒకటిగా కట్టిపడేస్తాయి. గంగమ్మ తల్లి కృపతో గ్రామంలో శాంతి, సుభిక్షాలు నెలకొంటాయి” అని పేర్కొన్నారు. యువత కూడా సంప్రదాయాలను కొనసాగించడంలో ముందుండటం హర్షణీయమని వారు అభిప్రాయపడ్డారు.మల్లెంపల్లెలో ప్రతి సంవత్సరం ఈ విధంగా గంగమ్మ తల్లి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ వేడుక గ్రామ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తూ, భవిష్యత్ తరాలకు మంచి సందేశాన్ని అందిస్తున్నదని వారు పేర్కొన్నారు.మొత్తానికి, గంగమ్మ తల్లి పూజలు మల్లెంపల్లెలో భక్తి, ఐక్యత, ఆనందాల సమ్మేళనంగా ఘన విజయాన్ని సాధించాయి.

తిరుపతి

బొజ్జల ఆశయాల బాటలో కార్యకర్తలు-జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి 78వ జయంతి వేడుకలు శ్రీకాళహస్తి పట్టణంలో సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగాయి. 24వ వార్డు మాజీ కౌన్సిలర్ భీమాల మునికృష్ణ మరియు పట్టణ యువత ఉపాధ్యక్షుడు వంకాయల సిద్దలయ్య ఆధ్వర్యంలో స్థానిక భిక్షాల గాలిగోపురం వద్ద భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిరుపేదలకు, భక్తులకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి నియోజకవర్గానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన చూపిన బాటలోనే నేడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అభివృద్ధి పథంలో నడుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గట్టిపూడి విజయకుమార్ నాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, తిరుపతి పార్లమెంట్ కోశాధికారి కంఠా రమేష్, మాజీ మండల అధ్యక్షుడు కామేష్ యాదవ్, బాలాజీ రెడ్డి, ఖాదర్, పార్టీ ముఖ్య కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

ప్రతి 90 రోజులకు ఒక జాబ్ మేళా.. స్థానిక యువతే నా ప్రాధాన్యత-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తిలోని JNTUA-SKIT కళాశాలలో ప్రజా నాయకుడు, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి 78వ జయంతిని పురస్కరించుకుని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెగా జాబ్ మేళా’కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బృందమ్మ, వారి ధర్మపత్ని శ్రీమతి రిషితా రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 40కి పైగా ప్రముఖ బహుళ జాతీయ కంపెనీలు పాల్గొన్నాయి. నియోజకవర్గం నలుమూలల నుండి తరలివచ్చిన 1163 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, వారిలో ప్రతిభ కనబరిచిన 582 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు స్వయంగా నియామక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో భాగంగా మన నియోజకవర్గ యువతకు అండగా ఉంటాం. ప్రతి 90 రోజులకు ఒకసారి ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించి స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే నా ధ్యేయం” అని ప్రకటించారు. నేటి మేళాలో ఎంపిక కాని వారిని ఉద్దేశించి మాట్లాడుతూ..ఎవరూ నిరాశ చెందవద్దని, వారికి త్వరలోనే ఉచిత నైపుణ్య శిక్షణ ఇప్పించి భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. తన తండ్రి గారి జయంతి నాడు ఇంతమంది యువతకు ఉద్యోగాలు రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

తిరుపతి

నాన్నగారి ఆశయాలే నా మార్గదర్శకం-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భావోద్వేగ నివాళి.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) ప్రజా నాయకుడు, మాజీ మంత్రి, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి 78వ జయంతి వేడుకలు శ్రీకాళహస్తిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. “జన హృదయ విజేతగా నిలిచిన నాన్నగారు నా ప్రతి అడుగుకు నిరంతర స్ఫూర్తి. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా, ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపై ఉంటాయని ఆశిస్తున్నాను,” అని భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి చూపిన బాటలోనే నడుస్తూ, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. “నాన్నగారి ఆశయాల సాధనే నా లక్ష్యం. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సేవకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా మరోసారి పునరంకితం అవుతున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొజ్జల కుటుంబ సభ్యులతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వర్గీయ గోపాలకృష్ణ రెడ్డి నియోజకవర్గానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో సాకారమైన పేదల సొంతింటి కల-1648 మందికి టిడ్కో ఇళ్ల పంపిణీ.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ నిరుపేదల దశాబ్దాల కల సాకారమైంది. ప్రజా నాయకుడు, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి 78వ జయంతిని పురస్కరించుకుని, నియోజకవర్గంలోని 1648 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారు టిడ్కో ఇళ్ల తాళాలను అందజేశారు. కూటమి నాయకులు, అధికారుల సమక్షంలో భారీ ఎత్తున గృహ ప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. “2018 నవంబర్ 29న నాన్నగారు ఆన్‌లైన్ లక్కీ డిప్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ లబ్ధిదారులను ఎంపిక చేశారు. నాడు ఆయన వేసిన పునాది నేడు ఆయన తనయుడిగా నా చేతుల మీదుగా పూర్తి కావడం నా అదృష్టం. నాన్నగారి ఆశయం నెరవేరడం నాకు అనంతమైన తృప్తినిస్తోందని పేర్కొన్నారు. నిరుపేదలందరికీ సొంతిల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. “ఈ పవిత్రమైన జయంతి వేళ ఇళ్లు పొందిన ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వే మా నాన్నగారికి మనం ఇచ్చే నిజమైన నివాళి. ప్రజల కోసం అంకితభావంతో పనిచేసేందుకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని సుధీర్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమకు ఇళ్ల తాళాలు అందించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ గృహ ప్రవేశాల ఉత్సవం జరిగింది.

తిరుపతి

ప్రమాదం జరిగినప్పుడు వణకవద్దు.. మెళకువలతో అరికట్టండి-అగ్నిమాపక అధికారి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) జాతీయ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ల వద్ద అగ్నిమాపక సిబ్బంది ప్రయాణికులకు, స్థానికులకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక కేంద్రాధికారి ఎన్. నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో సిబ్బంది అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కరపత్రాల ద్వారా వివరించారు. కేవలం మాటలతోనే కాకుండా, ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి? చిక్కుకున్న వారిని సురక్షితంగా ఎలా బయటకు తీసుకురావాలి (రెస్క్యూ) అనే అంశాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ మంటలను ఆర్పే విధానం, షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు స్పందించే తీరుపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారి నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. “అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు లోనుకాకుండా ప్రాథమిక అవగాహనతో వ్యవహరిస్తే భారీ ఆస్తి, ప్రాణ నష్టాలను అరికట్టవచ్చు” అని తెలిపారు. ప్రతి ఒక్కరూ అగ్నిమాపక నిబంధనలను పాటించాలని, అత్యవసర సమయాల్లో వెంటనే 101 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బందితో పాటు ప్రయాణికులు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు.

తిరుపతి

మనిషి కోసం మనిషిగా నిలుద్దాం.. ప్రాణదాతలుగా మారుదాం: అంబేద్కర్ యువజన సంఘం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. స్థానిక అంబేద్కర్ యువజన సంఘం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన (రజతోత్సవం) సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. “మనిషి కోసం మనిషిగా నిలుద్దాం.. రక్తదానం చేసి ప్రాణదాతలు అవుదాం” అన్న సంఘం పిలుపు మేరకు సుమారు 60 మంది యువకులు ఉత్సాహంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ సంఘం సభ్యులు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఒక్క అంబేద్కర్‌కే దక్కుతుందని కొనియాడారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని, దేశ స్వపరిపాలనకు దిక్సూచిగా రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడని వారు పేర్కొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గడిచిన 25 ఏళ్లుగా సేవా రంగంలో కొనసాగుతున్న అంబేద్కర్ యువజన సంఘం, భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలను నిర్వహిస్తుందని సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు డాక్టర్ శంకర్, రాజా, బాలాజ, సుధాకర్, శేఖర్, గణేష్, బాబి, సుభాష్, రాజేంద్ర, మనోజ్, కుమార్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

అమ్మ ఆశ్రమం రజతోత్సవ వేడుకలు: గంగపుత్ర గాంధీకి ఘన సన్మానం.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి శీవరులో ఉన్న ‘అమ్మ ఆశ్రమం’ 25వ వార్షికోత్సవ (రజతోత్సవ) వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా సమాజ సేవలో, కళారంగంలో విశేష కృషి చేస్తున్న భూలక్ష్మమ్మ, గంగపుత్ర గాంధీని ఆశ్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ….గంగపుత్ర గాంధీ తన రచనలు, పాటల ద్వారా సమాజంలోని రుగ్మతలపై నిరంతరం పోరాడుతున్నారని కొనియాడారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వారి పట్ల సంతానం వహించాల్సిన బాధ్యతలను తన కలం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారని ప్రశంసించారు. పిల్లలు తమ వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని, అది ప్రతి బిడ్డ ప్రాథమిక ధర్మమని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. సమాజాన్ని ప్రభావితం చేసే ఇలాంటి కళాకారులను గౌరవించుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా అభాగ్యులకు అండగా నిలుస్తున్న తమ ప్రయాణంలో గంగపుత్ర గాంధీ వంటి వారి సహకారం మరువలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రతినిధులు, ప్రముఖులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

టౌన్ ఫస్ట్ నుంచి స్టేట్ ర్యాంకుల దాకా.. ఎంజీఎం విద్యార్థుల విజయపతాకం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీకాళహస్తి ఎంజీఎం కాలేజీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరచి అద్భుత ఫలితాలను సాధించారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం విభాగాల్లో పలువురు విద్యార్థులు స్టేట్ ర్యాంకులు, టౌన్ ఫస్ట్‌లు సాధించి కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జూనియర్ ఎంపీసీ విభాగంలో షేక్ హప్ ఫ్షా 466/470 మార్కులతో టౌన్ ఫస్ట్‌తో పాటు స్టేట్ ర్యాంక్ సాధించింది. ఎం.ధరణి, కే.స్వాతి తలో 464 మార్కులతో ప్రతిభ చాటారు. జూనియర్ బైపీసీ విభాగంలో జి.అనుప్ డానియల్ 441/455, వి.గాయత్రి మరియు బి.నికిత తలో 439 మార్కులతో మెరుగైన ఫలితాలు సాధించారు. జూనియర్ సీఈసీ విభాగంలో జి.తనూజ 488/500 మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించగా, వి.పద్మావతి, కే.జ్ఞానేంద్ర కుమార్ తలో 476 మార్కులు సాధించారు. జూనియర్ ఎంఈసీ విభాగంలో వెంకటాచలపతి 474/500, మీనాక్షి 464/500 మార్కులతో మెరుగైన ఫలితాలు నమోదు చేశారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం సీనియర్ ఎంపీసీ విభాగంలో సి.యశస్విని 988/1000 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, బి.ఓజస్విని 986, ఎస్.సానియా 985 మార్కులు సాధించారు. సీనియర్ బైపీసీలో కె.జ్యోతి కుమార్ హాసిని ప్రియ మరియు ఎం.సుమశ్రీ తలో 983 మార్కులు సాధించగా, ఎం.భవ్య శ్రీ 980 మార్కులు సాధించింది. సీనియర్ సీఈసీ విభాగంలో జి.కిషోర్ 982, వి.కామేష్ 966 మార్కులతో ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా ఎంజీఎం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ.. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పోటీ పరీక్షల్లో కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఎంజీఎం విద్యాసంస్థలు డిజిటల్ బోధన విధానాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఈ విజయాలు సాధించాయని తెలిపారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ వి.ఎస్. రత్నం, లెక్చరర్లు విద్యార్థులను అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.