కళ్యాణ లక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న తులం బంగారం హామీ ఏమైందని బీఆర్ఎస్ ఖమ్మం నగర మాజీ అధ్యక్షులు పగడాల నాగరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం బీఆర్ఎస్ పోరుబాటలో భాగంగా ఖమ్మం ధర్నా చౌక్‌లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. విద్యార్థులు, రైతులు, మహిళలు, పేదలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.



