తెలుగు రైతుల ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారానికి చొరవ చూపిన గవర్నర్ కంభంపాటి హరిబాబు
అనపర్తి నియోజకవర్గ పర్యటనకు సాదర ఆహ్వానం
అనపర్తి, సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి): ఒడిశాలో వ్యవసాయం చేస్తున్న తెలుగు రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఒడిశా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబుకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గవర్నర్కు ఫోన్ చేసి మాట్లాడారు.
ఒడిశాలో తాము పండించిన ధాన్యాన్ని అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని తెలుగు రైతులు ఇటీవల ఎమ్మెల్యే నల్లమిల్లి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సహకారంతో ఒడిశా ప్రభుత్వంలోని సంబంధిత మంత్రులతో చర్చించి సమస్య పరిష్కారానికి నల్లమిల్లి కృషి చేశారు.
ఈ సమస్య పరిష్కారంలో గవర్నర్ కంభంపాటి హరిబాబు కీలకంగా స్పందించారు. ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి విజ్ఞప్తి మేరకు సంబంధిత శాఖల మంత్రులతో మాట్లాడి తెలుగు రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలా చొరవ తీసుకున్నారు.
రైతుల సమస్యను తన దృష్టికి తీసుకురాగానే స్పందించి, సంబంధిత మంత్రులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేసిన గవర్నర్ హరిబాబుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు.
ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గానికి పర్యటించాలని గవర్నర్ హరిబాబును ఎమ్మెల్యే నల్లమిల్లి సాదరంగా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానానికి గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.


