కపిలేశ్వరపురం, సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి): మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో “మన ఊరు – మన జెండా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ జెండా స్తూపం వద్ద అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశేషంగా సహకరిస్తోందన్నారు. అమరావతి, పోలవరం, విశాఖ రైల్వే జోన్, రహదారులు, రైల్వేలు, గృహ నిర్మాణం వంటి అనేక రంగాల్లో కేంద్రం సహకారం అందిస్తోందని తెలిపారు.
బీజేపీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన పెంచుకుని అర్హులైన ప్రజలకు వాటి ప్రయోజనాలు అందించాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తమనంపూడి రామకృష్ణారెడ్డి, చిట్టిబాబు, మండల అధ్యక్షురాలు పద్మావతి, మాజీ సర్పంచ్ స్రవంతి, నియోజకవర్గ కన్వీనర్ సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.



