నేల కొండపల్లి / ఖమ్మం
నేలకొండపల్లి మండలం లో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతివృత్తిదారులను ప్రోత్సహించి, వారి కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని భారతీయ జనతా పార్టీ పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ నున్నా రవికుమార్ అన్నారు. ఆదివారం పాలేరు అసెంబ్లీ పరిధిలోని నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లబ్ధిదారులకు పనిముట్లను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. వాషింగ్ మెషీన్లు, కుమ్మరి వృత్తిదారులకు మట్టి కలిపే (సాన) యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నున్నా రవికుమార్ మాట్లాడుతూ అంతరించిపోతున్న సంప్రదాయ చేతివృత్తులను కాపాడి, వృత్తిదారులకు ఆధునిక పనిముట్లతో చేయూత అందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మ యోజనను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో సుమారు 2,000 మంది లబ్ధిదారులకు యంత్రాలు అందించడంతో పాటు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం కూడా అందించినట్లు పేర్కొన్నారు. అనాసాగరంలో గూనగుంట్ల అనిల్, చల్లగుండ్ల రామారావు, రేగళ్ల రామకృష్ణ, గుణగుంట్ల రామకృష్ణ తదితరులకు పనిముట్లు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కోటి హనుమంతరావు, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మీగడ గోపి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



