*30 రోజులు దాటినా అందని సమాచారం.!*
ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతారాహిత్యాన్ని అరికట్టేందుకు తెచ్చిన సమాచార హక్కు చట్టం-2005 అధికారుల అలసత్వం వల్ల తుంగలో తొక్కుతున్నారు.చట్టప్రకా రం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా సమాచారం అందించాల్సి ఉండగా, గడువు దాటినా అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
*బాధితుడి భూమి హక్కులపై అధికారుల నిర్లక్ష్యం*
తిరుపతి జిల్లా, దొరవారిసత్రం మండలం, పూలతోట పరిధిలోని 3.10 సెంట్ల భూమికి సంబంధించి బాధితుడు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. రీసర్వే ప్రక్రియలో తన భూమి విస్తీర్ణాన్ని 2.50 సెంట్లకు తగ్గించడంపై, దానికి సంబంధించిన కారణాలు, నోటీసులు, ఎఫ్‌ఎమ్‌బీ (FMB) కాపీల వివరాలను సెక్షన్ 6(1) కింద కోరారు. అయితే దరఖాస్తు అంది నెల రోజులు గడిచినా సంబంధిత పౌర సమాచార అధికారి (PIO) నుండి ఎలాంటి స్పందన లేదు.
*అక్రమ మట్టి తరలింపు.. అధికారుల మౌనం పై రైతు అనుమానం*
ఇదే భూమి 3.10 సెంట్ల సరిహద్దుకు ఆనుకుని ఒక వ్యక్తి అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలించాడు. ఆ మట్టిని ఏ ప్రాతిపదికన, ఎవరి అనుమతులతో తరలించారు? అలాగే అతను మట్టి తవ్విన ప్రదేశం ఎవరికి సంబంధించినదో సర్వే చేసి చెప్పాలని కూడా దరఖాస్తులో కోరడం జరిగింది. కానీ ఈ ప్రశ్నకు కూడా అధికారులు సమాధానం దాటవేశారు.
దీన్ని బట్టి చూస్తుంటే రైతు భూమి విస్తీర్ణం తగ్గడానికి, అదే ప్రదేశంలో అనధికారికంగా మట్టి తరలించడానికి గల సంబంధాలు స్పష్టమవుతున్నాయని సదరు రైతు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగా అధికారులే ఈ అక్రమ మట్టి తరలింపునకు సహకరించారని, అందుకే సమాచారం ఇవ్వడానికి భయపడుతున్నారని ఆరోపిస్తున్నారు.
*చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు*
సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజులలోపు కోరిన వివరాలు ఇవ్వకపోవడం సమాచారాన్ని తిరస్కరించడంగానే పరిగణించబడుతుంది. అధికారుల ఈ తీరుపై బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు ప్రథమ అప్పీల్ (First Appeal) చేయడానికి సమాయత్తమవుతున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై సెక్షన్ 20(1) కింద జరిమానా విధించాలని, అలాగే సెక్షన్ 7(6) ప్రకారం అడిగిన సమాచారాన్ని ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజా సమస్యలు, అక్రమాలపై సమాచారం అడిగితే దాటవేత ధోరణి ప్రదర్శించడం అధికారుల జవాబుదారీతనారాహిత్యానికి నిదర్శనం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధితుడి భూమి సమస్యపై స్పష్టమైన సమాచారం అందించి, అక్రమ మట్టి తరలింపుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


