ఖమ్మం నగరానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మైనారిటీ విభాగం జిల్లా మాజీ అధ్యక్షులు మహ్మద్ తాజద్దీన్ గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. తాజద్దీన్ మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి, మైనారిటీ వర్గానికి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.



