*గ్రంథాలయాల అభివృద్ధికి రూ.7 కోట్ల వార్షిక బడ్జెట్ ఆమోదం*
*పాఠకులు, విద్యార్థుల సౌకర్యార్థం 40 గ్రంథాలయాల పనివేళల్లో మార్పు*
*గ్రంధాలయాలు అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి*
— గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డొంకాడ రామకృష్ణ
విజయనగరం, జిల్లా బ్యూరో/ రమణ ఆగస్టు 29: పున్నమి ప్రతినిధి
విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థకు సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డొంకాడ రామకృష్ణ అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు, అజెండా అంశాలను సభ ముందుంచి సభ్యుల ఆమోదం పొందారు. పౌర గ్రంథాలయ శాఖ, మంగళగిరి సంచాలకులు ఆర్.సి.నెం. 01-C2/2026, తేదీ 11-06-2026 ద్వారా ముందస్తుగా ఆమోదించిన ప్రతిపాదనలను కూడా సమావేశంలో ప్రవేశపెట్టి పూర్తిస్థాయి ఆమోదం తెలిపారు.
రూ.7 కోట్ల ప్రభుత్వ గ్రాంట్
2026–27 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలు తదితర అవసరాల కోసం ప్రభుత్వ గ్రాంట్‌గా రూ.7,00,00,000 (రూ.7 కోట్లు) అంచనా బడ్జెట్‌ను సమావేశం ఆమోదించింది.
*40 గ్రంథాలయాల పనివేళల్లో మార్పు*
పాఠకులు, విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్ర గ్రంధాలయం మినహా జిల్లా పరిధిలోని 40 గ్రంథాలయాల పనివేళలను మార్చే ప్రతిపాదనకు సమావేశం ఆమోదం తెలిపింది. ఇందులో 37 శాఖా గ్రంథాలయాలు, 3 గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి.
ప్రతిపాదిత కొత్త పనివేళలు ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఉండేలా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర గ్రంథాలయ పరిషత్, సంచాలకుల ఆమోదం కోసం పంపాలని సమావేశం నిర్ణయించింది.
RRRLF గ్రాంట్లు, సెస్ నిధులకు కేటాయింపులు
RRRLF గ్రాంట్ల కింద మ్యాచింగ్, నాన్-మ్యాచింగ్ పథకాలకు రూ.5,00,580 కేటాయింపులు చేశారు. అదేవిధంగా సెస్ ఫండ్ ద్వారా పరిపాలన, నిర్వహణ, పుస్తకాల కొనుగోలు, గ్రంథాలయ భవనాల నిర్మాణం తదితర అవసరాలకు బడ్జెట్ పార్ట్-IIలో నిధులు కేటాయించారు.
డిజిటలైజేషన్, పుస్తకాలు, భవనాలకు ప్రాధాన్యం
గ్రంథాలయాల ఆధునీకరణ, మౌలిక వసతుల అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. ఇందులో భాగంగా డిజిటలైజేషన్‌కు రూ.50,000, నూతన పుస్తకాల కొనుగోలుకు రూ.33 లక్షలు, భవన నిర్మాణాలకు రూ.50 లక్షలు కేటాయించారు.
ఆధునిక సదుపాయాలతో గ్రంథాలయాలను మరింత బలోపేతం చేసి, విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, పాఠకులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధ్యక్షులు తెలిపారు.
*గ్రంధాలయాలు అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి*
గ్రంథాలయాలను మరింత అభివృద్ధి చేసి, పాఠకులకు విస్తృతమైన విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి దాతలు ముందుకు రావాలని చైర్మన్ డొంకాడ రామకృష్ణ పిలుపునిచ్చారు. జిల్లాలోని దాతలు పెద్ద ఎత్తున పుస్తకాలను, ఫర్నిచర్ ను గ్రంథాలయాలకు దానం చేసి, విద్యార్థులు, పాఠకుల్లో జ్ఞాన వికాసానికి తమ వంతు సహకారం అందించాలని, గ్రంధాలయం భావనలు మరమ్మత్తులకు దాతలు సహకరించాలని ఆయన కోరారు. అదేవిదంగా మున్సిపాలిటీలు, పంచాయతీలు బాకీ ఉన్న గ్రంధాలయ సెస్ ను వెంటనే చెల్లించి ఆదుకోవాలని చైర్మన్ విజ్ఞప్తి చేసారు.
సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మరియు కన్వీనర్ బి. లక్ష్మి, సభ్యులు సమాచార పౌర సంబందాల శాఖ సహాయ సంచాలకులు పి.గోవిందరాజులు, జిల్లా పంచాయతీ, విద్యాశాఖ, వయోజన విద్యాశాఖల తరుపున వారి ప్రతినిధులు, గ్రంథాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


