తిరుమలాయపాలెం మండలం,కాకరవాయి
కోతుల బెడద, ప్రభుత్వ భూముల కబ్జాలపై ప్రభుత్వానికి హెచ్చరిక
కాకరవాయి గ్రామంలో రాజకీయ పార్టీల అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోతుల బెడద, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వివిధ పార్టీల నాయకులు చర్చించి ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు.
ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాల్సి ఉన్నప్పటికీ, కోతుల బెడద కారణంగా పంటలు వేసుకోలేకపోతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే కోతులను పట్టుకుని పునరావాస చర్యల్లో భాగంగా అడవుల్లో వదిలి, కాకరవాయి పరిసర ప్రాంతాల్లో కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా కాకరవాయి గ్రామపంచాయతీ పరిధిలోని ఐలమ్మ సెంటర్, సర్దార్ పాపయ్య గౌడ్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను కొందరు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. గతంలో అధికారులు నోటీసులు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజల అవసరాలకు వినియోగించాలని కోరారు.
ఈ అంశాలపై ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమర్పించారు. సమస్యలను పరిష్కరించకపోతే అన్ని పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సమావేశంలో బీఎస్పీ నాయకులు నల్లగట్టు శంకర్ మహరాజ్, ఎన్నవైన రమేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు కటుకూరి శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నాయకులు ఇందూరి మహేష్, సీపీఐ జిల్లా నాయకులు దంతాల బాలరాజు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు కొత్తపల్లి శివయ్య, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షులు పెనుగొండ ఉప్పలయ్య, టీడీపీ నాయకులు దేశోజు పూర్ణాచారి, సీపీఎం నాయకులు కొత్తపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


