రహదారి అధ్వానం.. రైల్వే గేటుతో ప్రజలకు తప్పని ఇబ్బందులు
అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 4 (పున్నమి న్యూస్ – రిపోర్టర్ ఆనంద్):
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఏటికొప్పాక గ్రామానికి రహదారి సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ అయిన ఏటికొప్పాక నుంచి పులపర్తి మీదుగా NH-5 ప్రధాన రహదారికి వెళ్లే మార్గం సక్రమంగా లేకపోవడంతో ప్రజలు, వాహనదారులు నిత్యం అవస్థలు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఏటికొప్పాక–పులపర్తి NH-5 రహదారి అభివృద్ధి చేయకపోవడంతో అత్యవసర సమయంలో అంబులెన్సులు, ఆటోలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు కూడా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు ఏటికొప్పాక–పద్మనాభరాజుపేట మధ్య ఉన్న రైల్వే గేటు ప్రజలకు ప్రధాన సమస్యగా మారింది. రైళ్ల రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వాహనాలు నిలిచిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో 30 నిమిషాలకు పైగా వేచి ఉండాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఈ ఆలస్యం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఏటికొప్పాక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఏటికొప్పాక నుంచి పులపర్తి–NH-5 రహదారిని అభివృద్ధి చేయడంతో పాటు రైల్వే గేటు వద్ద అండర్‌పాస్ లేదా ఆర్‌ఓబీ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
స్థానిక ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, రైల్వే శాఖల అధికారులతో సమన్వయం చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఏటికొప్పాక ప్రజల రహదారి కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.


