*రూపం*
రూపం ఎంత బాగున్నా
అది కంటి వరకే విలువ,
ఆ రూపం వెనుక దాగిన
మనసుకే మరిన్ని అసలైన విలువ.
అందమైన ముఖం చూసి
ఆకర్షణ కలగచ్చు,
అందమైన మనసు
చూసినప్పుడు ఆత్మీయత పుడుతుంది.
మాటలు మధురంగా ఉంటే
మనం కాసేపు మురిసిపోవచ్చు,
ఆ మాటల్లో నిజాయితీ ఉంటే
జీవితాంతం గుర్తుండిపోతుంది.
ముఖంపై చిరునవ్వు
అందాన్ని పెంచుతుంది,
మనసులోని మంచితనం
మనిషిని గొప్పవాడిని చేస్తుంది.
రంగులు మారేరూపానికి
కాలమే తీర్పుచెబుతుంది,
మార్పులేనిమంచితనానికి
కాలమే కీర్తి కిరీటంపెడుతుంది.
కలుషం లేని మనసు
కనిపించకపోయినా
కనిపిస్తుంది,నిజమైన మాట
పలికేవాడు మనిషి విలువ
తెలిసిపోతుంది.
ధనం ఉన్నవాడికంటే
ధర్మం ఉన్నవాడే గొప్ప,
రూపాయి విలువ కంటే
రూపం వెనుక గుణమే మిన్న.
చివరికి మిగిలేది రూపం కాదు,
మనసుతో పంచిన మమత,
మాటతో ఇచ్చిన ఓదార్పు,
మనిషిగా మిగిలిన మంచితనమే.
రచన : రేవెల్లి పద్మ
శివాని జూనియర్ కాలేజ్, హన్మకొండ

