అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు కావాలి, ఆగస్టు 3లోగా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించాలని సూచన
నాగర్కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హెమంత కేశవ్ పాటీల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియ పురోగతిని పరిశీలించిన ఆయన, అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి చేపడుతున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ……, ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి ఓటరికి ఈ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించాలని, ఆగస్టు 3వ తేదీలోగా ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించని వారి వివరాలు ఓటర్ల జాబితాలో నమోదు కాకపోవచ్చనే విషయాన్ని ప్రతి ఓటరికి స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.
అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా నమోదు ప్రక్రియకు దూరం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవసరమైన సమాచారం అందిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు డిజిటలైజేషన్ ప్రక్రియలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అదేవిధంగా, అనర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగకుండా చూడడంతో పాటు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటరు నమోదు (డూప్లికేట్ నమోదు) జరగకుండా అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రూపొందేలా ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తి చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.జిల్లా కలెక్టర్ వెంట నాగర్కర్నూల్ ఆర్డీవో అర్చన, బిజినపల్లి తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీవో, బీఎల్వోలు, డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్న అధికారులు తదితరులు ఉన్నారు.





