పున్నమి: రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు చేపడుతున్న “కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట” కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు 420 అడుగుల కాంగ్రెస్ 420 హామీల ఫ్లెక్సీతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో, ధర్నా చేపట్టారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) తో పాటు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని, ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పాటు స్థానిక ఎమ్మెల్యే కారణంగా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు ప్రస్తావిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు.



