వియ్యంపేటలో మహిళలకు పునరుత్పత్తి ఆరోగ్యం, పరిశుభ్రతపై కీలక సూచనలు
విశాఖపట్నం జిల్లా, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 3:
ప్రాజెక్ట్ రిషి సహకారంతో వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో వియ్యంపేట గ్రామ సచివాలయంలో మహిళలకు పునరుత్పత్తి ఆరోగ్యం, రుతుక్రమ పరిశుభ్రత, పోషకాహారం, మెనోపాజ్, వ్యక్తిగత పరిశుభ్రత, ఆర్థిక అక్షరాస్యత అంశాలపై ఒకరోజు అవగాహన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన 70 మంది మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాము మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటంతో పాటు పిల్లలకు కూడా పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై సరైన విషయాలను తెలియజేయాలని సూచించారు.
ప్రాజెక్ట్ రిషికి చెందిన రిథిక తుమ్మలపెంట మహిళలు తమ పునరుత్పత్తి ఆరోగ్యంపై శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రుతుక్రమ సమయంలో సరైన పరిశుభ్రతా సాధనాలను ఉపయోగించడం, నిర్ణీత వ్యవధిలో మార్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వివరించారు. ప్రాజెక్ట్ రిషికి చెందిన వింధ్య రుతుక్రమ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
వాసవ్య మహిళా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎం. అబ్రహాం మాట్లాడుతూ మహిళల ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన సమయంలో వైద్య సలహా పొందాలని సూచించారు. మహిళల ఆరోగ్యంతో పాటు కుటుంబ ఆర్థిక నిర్వహణపై అవగాహన కలిగి ఉండటం అవసరమన్నారు.
వాసవ్య మహిళా మండలి సిబ్బంది వరలక్ష్మి, హేమ, పార్వతి, భవాని, శర్మిల ఆర్థిక అక్షరాస్యత, రుతుక్రమం, పోషకాహారం, మెనోపాజ్, ఆరోగ్యకరమైన అలవాట్లు, పరిశుభ్రతా పద్ధతులపై శిక్షణ అందించారు.
కార్యక్రమంలో ప్రాజెక్ట్ రిషి బృంద సభ్యులు రియా, వృందా, కృషయ్, కరణ్, అర్షిత్, వాసవ్య మహిళా మండలి సిబ్బంది కామాక్షి, లక్ష్మి, కళావతి పాల్గొన్నారు.
హైలైట్
70 మంది మహిళలకు అవగాహన | పునరుత్పత్తి ఆరోగ్యం | రుతుక్రమ పరిశుభ్రత | పోషకాహారం | మెనోపాజ్ | ఆర్థిక అక్షరాస్యత



