భక్తుల రద్దీకి అనుగుణంగా బందోబస్తు.. ట్రాఫిక్, పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి : డీఎస్పీ వెంకటేశ్వర్లు
ఆత్మకూరు , సెప్టెంబర్ 3 (పున్నమి ప్రతినిధి):
నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో ఈ నెల 8న నిర్వహించనున్న శ్రీ ఖాజా నాయబ్ రసూల్ వారి 253వ గంధ మహోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆత్మకూరు డీఎస్పీ టి. వెంకటేశ్వర్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
డీఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లు గురువారం ఏఎస్‌పేట పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సై షేక్ జిలానీ, పోలీసు సిబ్బందితో ఫాల్‌ఇన్ నిర్వహించి విధుల నిర్వహణపై సమీక్షించారు. అనంతరం ప్రసిద్ధ శ్రీ ఖాజా నాయబ్ రసూల్, హబీబా అమ్మాజానుల దర్గాను సందర్శించి గంధ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా దర్గా ఈవో షేక్ మొహమ్మద్ హుస్సేన్‌తో సమావేశమైన డీఎస్పీ.. భక్తుల రాకపోకలు, రద్దీ నియంత్రణ, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.
దర్గా పరిసర ప్రాంతాలతో పాటు ఏఎస్‌పేట గ్రామంలోనూ భద్రతా చర్యలను పటిష్టంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. దర్గా నిర్వాహకులు, పంచాయతీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గంధ మహోత్సవం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.


