తిరుపతి కలెక్టరేట్, ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి
ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమంలో ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు నిర్వహించతలపెట్టిన శతాబ్ది ఉత్సవాలను వాయిదా వేసుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగం సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్సవాలకు అవసరమైన పోలీస్ బందోబస్తు కల్పించడం సాధ్యం కాదని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఆశ్రమ పాలకవర్గం, మాజీ విద్యార్థులు, భక్తుల మధ్య కొనసాగుతున్న యాజమాన్య వివాదాలు, గతంలో చోటుచేసుకున్న ఘర్షణ వాతావరణం, సోషల్ మీడియాలో ఇరు వర్గాల పరస్పర ఆరోపణల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిర్ణయించిన తేదీల్లో ఉత్సవాలు నిర్వహించకుండా 2026లో అనుకూలమైన మరో తేదీకి రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ అధ్యక్షతన కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులతో నిర్వహించిన సమగ్ర సమీక్ష అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఆశ్రమ కోశాధికారి ఎ. అమరనాథ్‌రెడ్డి సమర్పించిన బందోబస్తు వినతిపత్రాన్ని పరిశీలించిన అనంతరం పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా రానున్న తిరుమల తిరుపతి దేవస్థానం సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, వినాయక చవితి తదితర పండుగల బందోబస్తు విధుల కారణంగా తక్కువ వ్యవధిలో తగినంత పోలీస్ సిబ్బందిని కేటాయించడం కూడా కష్టమని అధికారులు తెలిపారు. కొత్త తేదీలను నిర్ణయించే ముందు కార్యక్రమ వివరాలు, భక్తుల అంచనా సంఖ్య, కోఆర్డినేటర్ల వివరాలతో జిల్లా యంత్రాంగానికి, పోలీస్ శాఖకు ముందస్తుగా రాతపూర్వక సమాచారం అందించాలని సూచించారు. అందిన వివరాల ఆధారంగా పరిస్థితిని సమీక్షించి అవసరమైన రక్షణ, ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఇరు వర్గాలు సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆరోపణలు చేయరాదని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రేణిగుంట డీఎస్పీ, ఏర్పేడు ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు.


