అనపర్తి, సెప్టెంబర్ 15 (పున్నమి ప్రతినిధి): భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని అనపర్తిలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఎస్‌ఈలు, ఈఈలు, డీఈలు, ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యేను ఇంజనీర్లు సత్కరించారు.
యువ ఇంజనీర్లకు విశ్వేశ్వరయ్య జీవితం, సేవలు స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని, వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజనీర్లు భాగస్వాములు కావాలని కోరారు. ఇంజనీర్స్ డే వేడుకలను ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ భావి ఇంజనీర్లలో స్ఫూర్తి నింపాలని ఆకాంక్షించారు.






