నెల్లూరు: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాను రాష్ట్రంలో నంబర్–1గా నిలిపేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు, సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పురోగతిపై మంగళవారం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. శాఖల మధ్య సమన్వయాన్ని మరింత పెంచి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో పనుల అమలును నిరంతరం పర్యవేక్షించాలని, సమస్యలు లేదా లోపాలు గుర్తిస్తే తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ ప్రయోజనాల్లో జాప్యం లేకుండా చూడడంతో పాటు ప్రతి శాఖ పనితీరులో స్పష్టమైన పురోగతి కనిపించాలని పేర్కొన్నారు.
“మనమంతా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిలో నెల్లూరును నంబర్–1గా నిలుపుదాం” అని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

