హైడ్రాను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలి
ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వివిధ వృత్తిదారులు
హైడ్రా కమిషనర్‌ను కలిసిన పలువురు వృత్తి నిపుణులు
గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసి, వరదలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో హైడ్రాను దిశానిర్దేశం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రంగాలకు చెందిన వృత్తి నిపుణులు మద్దతు తెలిపారు. హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి చెరువులు, వరద కాలువలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
నగరంతో పాటు శివారు ప్రాంతాలకు చెందిన పలువురు న్యాయవాదులు, పర్యావరణవేత్తలు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు తదితరులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు తెలిపారు.
హైడ్రా పునరుద్ధరించిన చెరువులను పరిశీలించిన పలువురు వృత్తి నిపుణులు వాటి అభివృద్ధి తీరుపై హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని చెరువులన్నింటినీ ఇదే తరహాలో ఇన్లెట్లు, ఔట్లెట్లతో అభివృద్ధి చేస్తే వరదలను చాలా వరకు నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు.
చెరువుల పరిసరాల్లో హైడ్రా అభివృద్ధి చేస్తున్న పచ్చదనం భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో చెరువుల్లో మూడు మీటర్ల మేర పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, పూడిక కారణంగా నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. ప్రస్తుతం పూడికను తొలగించి చెరువులను అభివృద్ధి చేయడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకే చెరువుల్లో నీరు చేరి స్వచ్ఛంగా కనిపిస్తున్నాయని వారు తెలిపారు. జలవనరులను పరిరక్షించడం ద్వారా ప్రకృతి సంరక్షణకు ఎంతో మేలు జరుగుతుందని, ఆ దిశగా హైడ్రా చేపడుతున్న చర్యలు అభినందనీయమని అన్నారు.
అదేవిధంగా పార్కులు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలు కబ్జాలకు గురికాకుండా చూడటం సాధారణ విషయం కాదని పలువురు పేర్కొన్నారు. హైడ్రా పట్ల నగర ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ఇదే స్ఫూర్తితో కార్యక్రమాలను కొనసాగిస్తూ హైదరాబాద్‌లో ఆహ్లాదకరమైన, పర్యావరణహిత వాతావరణాన్ని మరింత మెరుగుపరచాలని కోరారు.
చెరువులు, వరద కాలువలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు హైడ్రా చర్యలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


