Wednesday, 30 September 2026

Tag: హైదరాబాద్ వి విష్ణుమూర్తి

మేడ్చల్ – మల్కాజిగిరి

గంగారంలో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

3,500 మందికి పైగా నిరుపేదలు, వృద్ధులు, కూలీలకు అన్నప్రసాదం గంగారం: సేవే పరమావధిగా ముందుకు సాగుతున్న హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంగారంలోని ఫౌండేషన్ కార్యాలయంలో శనివారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నిరుపేదలు, వృద్ధులు, కూలీలు తదితరులు కలిపి 3,500 మందికి పైగా అన్నప్రసాదాన్ని అందించారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి వారం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా హోప్ ఫౌండేషన్ అధ్యక్షులు కొండ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. “ఆకలితో ఎవరూ నిద్రపోకూడదనే ఉద్దేశంతో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పేదలు, నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే మా ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతాం” అని తెలిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న హోప్ ఫౌండేషన్ సేవలను స్థానిక ప్రజలు అభినందించారు. సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, నిర్వాహకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయి నుంచే కార్యాచరణ: మీనాక్షీ నటరాజన్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. గాంధీ భవన్‌లో ఏఐసీసీ  తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పిఎసి  సమావేశంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం, ప్రజలకు మరింత చేరువ కావడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మీనాక్షీ నటరాజన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను నిరంతరం తెలుసుకుంటూ, వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు ప్రతి కార్యకర్తను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఎస్ ఐ ఆర్  కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఎప్పటికప్పుడు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, వారి కృషి, సమష్టి నాయకత్వంతోనే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయగలమని మీనాక్షీ నటరాజన్ అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, సుధీర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్, హరివర్ధన్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, బండి రమేష్, పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

ప్రధాన రహదారిపై వారాంతపు సంతను తొలగించాలి

ప్రధాన రహదారిపై వారాంతపు సంతను తొలగించాలి ప్రజావాణిలో జీసీఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం జీడిమెట్ల: సుచిత్ర–కుత్బుల్లాపూర్ ప్రధాన రహదారిలోని కృష్ణానగర్–జయరాంనగర్ ప్రాంతంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న వారాంతపు సంత కారణంగా తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని జీడిమెట్ల 132వ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వీరారెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సమస్యపై సోమవారం ప్రజావాణిలో జీసీఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు వీరారెడ్డి నరేందర్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ప్రధాన రహదారిపై నిర్వహిస్తున్న వారాంతపు సంతను తొలగించి, సంత నిర్వహణకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఆయన కోరారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సంత కారణంగా ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపారు. వ్యాపారులు, కొనుగోలుదారులు రహదారిపైకి రావడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా అంబులెన్స్‌లు, అత్యవసర సేవల వాహనాలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకునే పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరమని వీరారెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ప్రజల భద్రత, సౌకర్యం, సురక్షిత రాకపోకలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారాంతపు సంత నిర్వహణకు అనువైన ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించి, ఇకపై అక్కడే సంత నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాముడు యాదవ్, మహిళా నాయకురాలు ఇందిరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

కేసీఆర్ పథకాలను ఒక్కొక్కటిగా తొలగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: హరీశ్ రావు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 42 లక్షల 15 వేల మంది రైతులకు ఈ పథకం భరోసా కల్పించిందని పేర్కొన్నారు. అయితే ఆగస్టు 13 నుంచి రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న బీమా పథకం వల్ల సుమారు 13 లక్షల మంది రైతులు బీమా సౌకర్యానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాన్ని ప్రస్తావిస్తూ, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రూ.19 వేల కోట్ల బకాయిలు పెట్టిపోతే, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను చెల్లించిందని హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వాలు మారినప్పటికీ గత ప్రభుత్వాలు అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించాలన్న కనీస ఇంగితం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పాత రైతు బీమా పథకాన్నే యథాతథంగా కొనసాగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని హరీశ్ రావు స్పష్టం చేశారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

ఎంఎంసీ ప్రజావాణికి 29 దరఖాస్తులు

ఎంఎంసీ ప్రజావాణికి 29 దరఖాస్తులు టౌన్ ప్లానింగ్ విభాగానికి అత్యధికంగా 21 దరఖాస్తులు మల్కాజ్‌గిరి: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ( ఎం ఎం సి ) ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 29 దరఖాస్తులు అందాయి. ఆగస్టు 17న అందిన దరఖాస్తుల్లో టౌన్ ప్లానింగ్ విభాగానికి 21, ఇంజినీరింగ్ విభాగానికి 5, రెవెన్యూ విభాగానికి 3 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజల నుంచి అందుతున్న ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదులు, వినతులపై నిర్లక్ష్యం లేకుండా స్పందిస్తూ, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలను దరఖాస్తుదారులకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, వారి సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించడం లక్ష్యంగా ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎం ఎం సి  అధికారులు కోరారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కమిషనర్లు రఘు ప్రసాద్, వేణు గోపాల్, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రావు, అదనపు చీఫ్ సిటీ ప్లానర్ రంజిత్ కుమార్, చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వెంకటేశ్వర్ రెడ్డి, యూబీడీ డైరెక్టర్ సునంద, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవ రెడ్డి, రెవెన్యూ సూపరింటెండెంట్ అజ్మత్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జీఎం జి.ఎం. ముస్తఫాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

ఎస్ ఐ ఆర్ -2026 ఎన్యూమరేషన్ దశ విజయవంతంగా పూర్తి

ఎస్ ఐ ఆర్ -2026 ఎన్యూమరేషన్ దశ విజయవంతంగా పూర్తి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ( సీఈఓ ) సి. సుదర్శన్ రెడ్డి, ఐఏఎస్ సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి, ఐఏఎస్ ప్రభుత్వ అదనపు కార్యదర్శి, ఎంఎన్ఓ  ఎన్. శంకర్, డిప్యూటీ సీఈఓ  ( ఎఫ్ ఎ సి ) జి.ఎస్. చారి, పి ఎం  ( ఐటి ) నోడల్ అధికారులు, సీఈఓ  తెలంగాణ కార్యాలయానికి చెందిన ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్ ఐ ఆర్ -2026లో భాగంగా 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించిన ఎన్యూమరేషన్ దశ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ఈ దశకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఎలక్టర్ల నుంచి మొత్తం 2.65 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు ( ఈ ఎఫ్ ఎస్ ) సేకరించినట్లు, ఇది రాష్ట్రంలోని మొత్తం ఎలక్టర్లలో 78.30 శాతం అని తెలిపారు. అలాగే మరణించిన ఎలక్టర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, అందుబాటులో లేని లేదా గైర్హాజరైన ఎలక్టర్లు, ఇతర కేటగిరీలకు చెందిన ఓటర్లు, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల్లో నమోదైన ఎలక్టర్లకు సంబంధించిన వివరాలను సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్ ఎలక్టరల్  రోల్ ) ప్రచురణతో పాటు, ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16, 2026 వరకు నిర్వహించనున్న క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ దశకు చేపట్టిన ఏర్పాట్లను కూడా సీఈఓ  రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఎస్ ఐ ఆర్  ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన సీఈఓ  వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను స్వీకరించి పరిశీలిస్తామని తెలిపారు. అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ఓటర్ల జాబితాలను హార్డ్‌డిస్క్ ద్వారా అందజేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలనతో పాటు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ప్రక్రియలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు చురుకుగా పాల్గొనాలని సీఈఓ  కోరారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటర్ల జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలని సూచించారు. ఓటర్ల జాబితా ఖచ్చితమైనది, సమగ్రంగా, పారదర్శకంగా, లోపరహితంగా ఉండేలా అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత వర్గాలు సహకరించాలని సీఈఓ  సి. సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

సర్వే నంబర్లు 145, 163 భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం

సర్వే నంబర్లు 145, 163 భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు కూకట్‌పల్లి: వసంతనగర్ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్లు 145, 163లోని భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైన సందర్భంగా వసంతనగర్ సెంటర్‌లో కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు పాలాభిషేకం నిర్వహించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సమస్య పరిష్కారం కోసం మంత్రులు, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కృషి చేసిన కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బండి రమేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వసంతనగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు మాకినేని ఏకనారాయణ (వినోద్), డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిలారు శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, సర్వే నంబర్లు 145, 163లోని భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బండి రమేష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వసంతనగర్ డివిజన్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మాకినేని ఏకనారాయణ (వినోద్) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా వసంతనగర్ డివిజన్ ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా వారి వెంట ఉంటూ పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం ప్రజలకు, నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి

జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి హైదరాబాద్: జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నింటినీ 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ పారిశ్రామిక వాడకు సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సోమవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిర్వహించిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ( ఎన్ ఐ సి డి ఐ టి ) వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి శ్రీధర్ బాబు సచివాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిశ్రమల శాఖ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో పూర్తి స్థాయిలో పారిశ్రామిక కార్యకలాపాలు ప్రారంభమైన అనంతరం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. స్మార్ట్ సిటీలో భూమి రూపంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం ఉండగా, అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని తెలిపారు. ఇప్పటికే స్పెషల్ పర్పస్ వెహికల్ ( ఎస్ పి వి )కు అభివృద్ధి ప్రణాళికను అందజేసినట్లు పేర్కొన్నారు. ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ ( ఈపీసీ ) విధానంలో జరుగుతున్న పనులను ముందుగా నిర్ణయించిన గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. నీటి సరఫరా పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, విద్యుత్ సరఫరా పనులను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా భవ్య (భారత్  అవుద్యోగిక్  వికాస్ యోజన ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100 ప్లగ్‌ అండ్‌ ప్లే పారిశ్రామిక పార్కుల్లో నాలుగు పార్కులను తెలంగాణకు కేటాయించాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను శ్రీధర్ బాబు కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో టి జి ఐ ఐ సి  ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య, పరిశ్రమల కమిషనర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

హైదరాబాద్ రన్–2026 సజావుగా నిర్వహణకు సమన్వయ సమావేశం

హైదరాబాద్ రన్–2026 సజావుగా నిర్వహణకు సమన్వయ సమావేశం హైదరాబాద్: హైదరాబాద్ రన్–2026ను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమన్వయ సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్న 15వ ఎడిషన్ హైదరాబాద్ రన్–2026కు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నాలుగు విభాగాల్లో నిర్వహించనున్న పరుగులపై అధికారులు సమీక్షించారు. 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల రన్, 5 కిలోమీటర్ల రన్ నిర్వహించనున్నారు. 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్‌లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభం కానున్నాయి. 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల పరుగులు మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ నుంచి ప్రారంభమై, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జి.ఎం.సి. బాలయోగి అథ్లెటిక్ స్టేడియం, గచ్చిబౌలి వద్ద ముగియనున్నాయి. సమావేశంలో ట్రాఫిక్ నిర్వహణ, రూట్ ఏర్పాట్లు, పోలీసు సిబ్బంది బందోబస్తు, భద్రతా చర్యలు, పాల్గొనే వారి రక్షణతో పాటు ఇతర అవసరమైన ఏర్పాట్లపై అధికారులు సమగ్రంగా చర్చించారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, బారికేడ్లు, సూచిక బోర్డులు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని అధికారులు సమీక్షించారు. హైదరాబాద్ రన్–2026లో పాల్గొనే క్రీడాకారులు, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, కార్యక్రమం సజావుగా జరిగేలా నిర్వాహకులు, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సంక్రాంతి రవి కుమార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్–I) జి. హనుమంత రావు, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్–I) కె. చంద్రశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎస్ సి ఎస్ సి    సీఈఓ నవీద్ ఖాన్, మాదాపూర్ ట్రాఫిక్ డివిజన్ అధికారులు, ఎన్ ఎం డి సి  హైదరాబాద్ రన్నర్స్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి

జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నీ 2028 మార్చి వరకు పూర్తి చేస్తామని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ పారిశ్రామిక వాడకు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. సోమవారం నాడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్ లు న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ( ఎన్ఐసీడీఐటీ ) వీడియో కాన్ఫరెన్సులో శ్రీధర్ బాబు సచివాలయం నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిశ్రమల మంత్రులు ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. జహీరాబాద్ స్మార్ట్ సిటీలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని శ్రీధర్ బాబు వివరించారు. ఈ స్మార్ట్ సిటీలో భూమి రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం ఉండగా, కేంద్ర ప్రభుత్వం అభివృధ్ది పనులకు నిధులు అందజేస్తోంది. ఇప్పటికే స్పెషల్ పర్పస్ వెహికల్ ( ఎస్ పి వి ) కు అభివృద్ధి ప్రణాళికను అందజేసినట్టు శ్రీధర్ బాబు తెలిపారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్ మెంట్, కన్ స్ట్రక్షన్ (ఇపిసి) పద్ధతిలో జరగుతున్న పనులు ముందుగా నిర్ణయించిన సమయానికి పూర్తవుతాయిని శ్రీధర్ బాబు వెల్లడించారు. నీటి సరఫరా పనుల టెండర్ల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. విద్యుత్తు సరఫరా పనులను కూడా గడువులోగా పూర్తి చేస్తామని వివరించారు. భవ్య (భారత్  అవుద్యోగిక్  వికాస్ యోజన్ ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల్లో నాలుగింటిని తెలంగాణాకు కేటాయించాలని మంత్రి పీయూష్ గోయెల్ ను కోరారు. వీడియో కాన్ఫరెన్సులో టిజిఐఐసి ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య, పరిశ్రమల కమిషనర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.