జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి
హైదరాబాద్: జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నింటినీ 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ పారిశ్రామిక వాడకు సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
సోమవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిర్వహించిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ( ఎన్ ఐ సి డి ఐ టి ) వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి శ్రీధర్ బాబు సచివాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిశ్రమల శాఖ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో పూర్తి స్థాయిలో పారిశ్రామిక కార్యకలాపాలు ప్రారంభమైన అనంతరం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు.
స్మార్ట్ సిటీలో భూమి రూపంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం ఉండగా, అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని తెలిపారు. ఇప్పటికే స్పెషల్ పర్పస్ వెహికల్ ( ఎస్ పి వి )కు అభివృద్ధి ప్రణాళికను అందజేసినట్లు పేర్కొన్నారు.
ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ ( ఈపీసీ ) విధానంలో జరుగుతున్న పనులను ముందుగా నిర్ణయించిన గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. నీటి సరఫరా పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, విద్యుత్ సరఫరా పనులను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు.
అదేవిధంగా భవ్య (భారత్ అవుద్యోగిక్ వికాస్ యోజన ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల్లో నాలుగు పార్కులను తెలంగాణకు కేటాయించాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను శ్రీధర్ బాబు కోరారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో టి జి ఐ ఐ సి ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య, పరిశ్రమల కమిషనర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.



