ఎస్ ఐ ఆర్ -2026 ఎన్యూమరేషన్ దశ విజయవంతంగా పూర్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ( సీఈఓ ) సి. సుదర్శన్ రెడ్డి, ఐఏఎస్ సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి, ఐఏఎస్ ప్రభుత్వ అదనపు కార్యదర్శి, ఎంఎన్ఓ ఎన్. శంకర్, డిప్యూటీ సీఈఓ ( ఎఫ్ ఎ సి ) జి.ఎస్. చారి, పి ఎం ( ఐటి ) నోడల్ అధికారులు, సీఈఓ తెలంగాణ కార్యాలయానికి చెందిన ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్ ఐ ఆర్ -2026లో భాగంగా 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించిన ఎన్యూమరేషన్ దశ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ఈ దశకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.
ఎలక్టర్ల నుంచి మొత్తం 2.65 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు ( ఈ ఎఫ్ ఎస్ ) సేకరించినట్లు, ఇది రాష్ట్రంలోని మొత్తం ఎలక్టర్లలో 78.30 శాతం అని తెలిపారు. అలాగే మరణించిన ఎలక్టర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, అందుబాటులో లేని లేదా గైర్హాజరైన ఎలక్టర్లు, ఇతర కేటగిరీలకు చెందిన ఓటర్లు, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల్లో నమోదైన ఎలక్టర్లకు సంబంధించిన వివరాలను సమావేశంలో వెల్లడించారు.
రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ ) ప్రచురణతో పాటు, ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16, 2026 వరకు నిర్వహించనున్న క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ దశకు చేపట్టిన ఏర్పాట్లను కూడా సీఈఓ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.
ఎస్ ఐ ఆర్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన సీఈఓ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను స్వీకరించి పరిశీలిస్తామని తెలిపారు.
అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ఓటర్ల జాబితాలను హార్డ్‌డిస్క్ ద్వారా అందజేశారు.
ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలనతో పాటు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ప్రక్రియలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు చురుకుగా పాల్గొనాలని సీఈఓ కోరారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటర్ల జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలని సూచించారు.
ఓటర్ల జాబితా ఖచ్చితమైనది, సమగ్రంగా, పారదర్శకంగా, లోపరహితంగా ఉండేలా అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత వర్గాలు సహకరించాలని సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.



