శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ఖమ్మం హార్వెస్ట్ ప్రైమరీ పాఠశాలలో చిన్నారులచే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల సెక్రటరీ, కరస్పాండెంట్ పి. రవిమారుత్, ప్రిన్సిపల్ ఆర్. పార్వతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాలను వివిధ రకాల పూలమాలలతో అలంకరించి పండుగ వాతావరణంలో వేడుకలకు శ్రీకారం చుట్టారు. శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారులు అలరించారు. పాఠశాల మైదానంలో ఉట్టి ఏర్పాటు చేసి ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. సంప్రదాయ వేషధారణలో చిన్నారులు చూపిన సందడి ఆకట్టుకుంది. విద్యార్థుల్లో ఆసక్తి, ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఆయా సందర్భాలకు అనుగుణంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ పార్వతి రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రైమరీ హెచ్‌ఎం మానస, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.



