తిరుపతి జిల్లా పోలీస్ శాఖ
నాయుడుపేట.
తేదీ: 18-08-2026
– సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనంపై నాయుడుపేట పోలీసులు సమగ్ర విచారణ.
– దిష్టి పూజ నిర్వహించినట్లు విచారణలో వెల్లడి – క్షుద్ర పూజలు జరిగినట్లు నిర్ధారణ కాలేదు.
– వ్యక్తి అనారోగ్యానికి క్షుద్ర పూజలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టత.
– అసత్యాలు, వదంతులను నమ్మవద్దని ప్రజలకు పోలీసుల సూచన.
– సున్నితమైన అంశాలను ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని మీడియా మిత్రులకు విజ్ఞప్తి.
తిరుపతి 18: నాయుడుపేట పట్టణంలోని బీడీ కాలనీ సమీపంలో గల స్వర్ణముఖి నదిలో 17-08-2026 రాత్రి సుమారు 10:00 గంటల సమయంలో క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా కొన్ని సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం జరుగుతున్న విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో నాయుడుపేట పట్టణ పోలీసులు వెంటనే స్పందించి, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారంపై సమగ్రంగా విచారణ చేపట్టారు.
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, చెన్నై, రెడ్‌హిల్స్ ప్రాంతానికి చెందిన చిన్నదొరై గణశేఖర్, వయస్సు సుమారు 60 సంవత్సరాలు, కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆయన భార్య పద్మావతి. పద్మావతికి నాయుడుపేట ప్రాంతంలో బంధువులు ఉండటంతో, తన భర్తకు ఉన్న అనారోగ్య సమస్యలు నయమవుతాయనే మూఢనమ్మకంతో, బంధువుల సూచన మేరకు నాయుడుపేట అగ్రహారం ప్రాంతానికి చెందిన కటకం ముత్యాలయ్య అనే వ్యక్తి ద్వారా స్వర్ణముఖి నది వద్ద దిష్టి పూజ నిర్వహించినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ కార్యక్రమంలో భాగంగా దిష్టి తీసే సమయంలో ఒక బొమ్మ/ఆకారం గీసి పూజా కార్యక్రమం నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విధంగా అక్కడ క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ఎలాంటి ఆధారాలు లేదా నిర్ధారణ పోలీసుల విచారణలో లభించలేదు.
అదేవిధంగా, పూజా కార్యక్రమం అనంతరం చిన్నదొరై గణశేఖర్ అస్వస్థతకు గురైనట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో ఆయనకు ముందుగానే కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిసింది. అందువల్ల ఆయన అస్వస్థతకు గురైన విషయాన్ని క్షుద్ర పూజలతో ముడిపెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వాస్తవ పరిస్థితులకు భిన్నమైనదిగా పోలీసులు స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి సూచనల మేరకు ప్రజల్లో అనవసర భయాందోళనలు కలిగించే వదంతులు, నిర్ధారణ కాని సమాచారంపై పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, సోషల్ మీడియా వేదికల్లో వచ్చే ప్రతి సమాచారాన్ని వాస్తవమని భావించకుండా సంబంధిత పోలీసు అధికారుల ద్వారా నిజానిజాలను నిర్ధారించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ప్రజల దృష్టికి ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, వదంతులను వ్యాప్తి చేయడం కాకుండా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని, ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
– మీడియా మిత్రులకు ప్రత్యేక విజ్ఞప్తి.
ప్రజల్లో భయాందోళనలు కలిగించే అవకాశం ఉన్న ఇటువంటి సున్నితమైన అంశాలను ప్రచురించే ముందు సంబంధిత పోలీసు అధికారుల వద్ద వాస్తవాలను నిర్ధారించుకోవాలని కోరడమైనది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిర్ధారణ కాని కథనాలను యథాతథంగా ప్రచారం చేయకుండా, వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసే విధంగా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


