భూపాలపల్లి, ఆగస్టు 20(పున్నమి ప్రతినిధి): పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ, నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.గురువారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పుస్తకాలు, పాఠకులకు అందుతున్న సౌకర్యాలు, డిజిటల్ లైబ్రరీ ఏర్పాట్లు, మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు.అభ్యర్థులకు అవసరమైన కాంపిటీటివ్ పుస్తకాలు, కంప్యూటర్ సదుపాయం, ఆర్ఓ వాటర్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.గ్రంథాలయాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్రమశిక్షణతో చదివి, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని అభ్యర్థులకు సూచించారు.
అనంతరం గ్రంథాలయ ప్రాంగణంలో కలెక్టర్ మొక్క నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య, గ్రంథాలయ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


