మల్లెంపల్లి, జెట్టివారిపల్లి, తుమ్మకొండ గ్రామాల్లో ప్రత్యేక పర్యవేక్షణ
మండలంలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో మల్లెంపల్లి, జెట్టివారిపల్లి, తుమ్మకొండ గ్రామాల్లో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేపట్టారు. గ్రామాలతో పాటు శివారు ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలను డ్రోన్ల ద్వారా పరిశీలించారు. పేకాట స్థావరాలు, కోళ్ల పందేలు జరిగే ప్రాంతాలు, గంజాయి నిల్వలు, వినియోగానికి అవకాశం ఉన్న ప్రదేశాలు, బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. డ్రోన్ నిఘాలో అనుమానాస్పద కదలికలు గుర్తించిన వెంటనే స్థానిక పోలీసు సిబ్బంది స్పందించి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. మండలంలోని మరిన్ని గ్రామాల్లోనూ పరిస్థితిని బట్టి డ్రోన్ నిఘాను విస్తరిస్తామని పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే ప్రజలు పోలీసులకు తెలియజేసి సహకరించాలని పోలీసులు కోరారు.







