మంథని, సెప్టెంబర్ 03:
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికలు, సత్యభామల వేషధారణలతో అలరించారు. చిన్నారుల ఆటపాటలు, రంగురంగుల వేషధారణలతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు స్వరూప రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణుడి జన్మదిన విశిష్టతను విద్యార్థులకు వివరించారు. చిన్నారులు కృష్ణుడి వేషధారణతో పాటు గోపికలు, సత్యభామల వేషధారణలో పాల్గొని ఎంతో ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకున్నారని తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడంతో పాటు వారిలో సృజనాత్మకతను వెలికితీస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని కృష్ణాష్టమి వేడుకలను విజయవంతం చేశారు.


