కడపలో అక్రమ నిర్మాణంపై మున్సిపల్ అధికారుల కొరడా
అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం కూల్చివేత
అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర ఆధ్వర్యంలో చర్యలు
పున్నమి ప్రతినిధి, కడప, సెప్టెంబర్ 4:
కడప నగరంలోని విజయ దుర్గమ్మ ఆలయం వెనుకవైపు మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నూతన భవనంపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు భవన నిర్మాణాన్ని కూల్చివేశారు.
కడప మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర ఆధ్వర్యంలో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని నిర్మాణ పరిస్థితిని పరిశీలించారు. అనంతరం నిబంధనల ప్రకారం కూల్చివేత చర్యలు చేపట్టారు.
నగరంలో మున్సిపల్ అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలపై తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కూల్చివేత చర్యతో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న వారికి మున్సిపల్ అధికారులు గట్టి హెచ్చరిక జారీ చేసినట్లయింది.









