హైవేలపై గణేష్ చందా వసూళ్లు..
నెల్లూరు: (రూరల్)’
తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తం
గణేష్ నవరాత్రుల సందర్భంగా చందాల వసూళ్ల పేరుతో కొందరు స్కూల్ విద్యార్థులు హైవేలపైకి వెళ్లి వాహనాలను ఆపుతూ చందాలు అడుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు వేగంగా ప్రయాణించే హైవేలపై విద్యార్థులు రోడ్డుపైకి రావడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వాహనదారులు ఒక్కసారిగా బ్రేకులు వేయడం, విద్యార్థులు వాహనాలకు దగ్గరగా వెళ్లడం వంటి పరిణామాలు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హైవేలపై చందాలు అడగకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే పాఠశాల యాజమాన్యాలు కూడా విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. సంబంధిత అధికారులు సైతం హైవేలపై ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


