పెనుబల్లి/ ఖమ్మం
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండలపాడు గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పడిగల మధు లక్ష్మి దంపతుల మూడో కుమార్తె సాయి నందిని చదువుల్లో ప్రతిభను చాటుకుని మెడికల్ సీటు సాధించింది. చిన్నప్పటి నుంచే చదువుల్లో ప్రతిభ కనబరుస్తూ ప్రతి తరగతిలోనూ ప్రథమ స్థానంలో నిలుస్తూ వచ్చిన సాయి నందిని, పదో తరగతిని వంగముత్యాల బంజర్ అరుణోదయ స్కూల్‌లో పూర్తి చేసి 10కి 10 పాయింట్లు సాధించింది. అనంతరం హైదరాబాద్ హైటెక్ సిటీలోని నారాయణ మెడికల్ అకాడమీలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి 1000 మార్కులకు 987 మార్కులు సాధించింది. అనంతరం ప్రతిష్టాత్మక వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌లో 6118 ర్యాంక్ సాధించి తన ప్రతిభను మరోసారి నిరూపించుకుంది. ఈ ఘన విజయంతో కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించింది. సాయి నందిని పట్టుదల, కృషి, చదువుపై ఉన్న ఆసక్తి కారణంగానే ఈ విజయాన్ని అందుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి పోటీలో మెరుగైన ర్యాంక్ సాధించి ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందడం పట్ల మండలపాడు గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ సాయి నందినికి అభినందనలు తెలిపారు.



