Tuesday, 22 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

పున్నమి న్యూస్ కథనానికి స్పందన.. ఎస్సీ కాలనీలో డ్రైనేజీ క్లియరెన్స్..!

యలమంచిలి, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక ఎస్సీ కాలనీలో డ్రైనేజీ, మంచినీటి సమస్యలపై పున్నమి న్యూస్‌లో ప్రచురితమైన కథనానికి అధికారులు, కూటమి నాయకులు స్పందించారు. కాలనీలోని సమస్యలను స్వయంగా పరిశీలించి, వెంటనే చర్యలు చేపట్టారు. డ్రైనేజీ కాలువలో పేరుకుపోయిన చెత్త, మురుగును క్రేన్‌ మెషిన్‌ సహాయంతో తొలగించే పనులను ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి గిరి ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు అన్నం బాబ్జి, కాండ్రకోట చిరంజీవి, శెన్నాంశెట్టి శ్రీను, గొంతుమూర్తి కొండయ్య నాయుడు, భజంత్రీలు శ్రీను కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. “ప్రజల సమస్యలు మాకు ముఖ్యం. మేము ప్రజలకు దగ్గరలోనే ఉంటాం.. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి.. పరిష్కారం కోసం కృషి చేస్తాం” అని తెలిపారు. మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు తదితర సమస్యలను కూడా పరిశీలించి దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి స్పందించేలా చేసిన పున్నమి న్యూస్‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో గ్రామసభ.. సమస్యల పరిష్కారంపై చర్చ….!

యలమంచిలి, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాద్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామసభలో గ్రామంలోని పలు సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామ ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ సాగింది. తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, రహదారులు తదితర మౌలిక వసతుల సమస్యలను గ్రామస్థులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పంచాయతీ అధికారులు తెలిపారు. ఈ గ్రామసభలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొని గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించారు.

అనకాపల్లి

రేవుపోలవరం జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు..!

ఎస్.రాయవరం, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం జెడ్పీహెచ్‌ఎస్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హెచ్‌ఎం అరుణ గారి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా పాల్గొని స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం అరుణ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛ లభించిందని, విద్యార్థులు దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటం గురించి తెలుసుకుని దేశభక్తి, క్రమశిక్షణ, బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందించిన దాతలు చోడిపల్లి ఎర్రారావు, చోడిపల్లి బంగారి, వాసిపల్లి ఆడవిరాజు, వాసిపల్లి రమణబాబులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ అర్జిల్లి ఎర్రయ్య, హెచ్‌ఎం అరుణ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు రాజారావు, లోవరాజు, గోవింద్, బంగారి, అప్పన్న, కె.లోవరాజు కె. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పాఠశాల పీడీ మాస్టర్ బి.కృష్ణ మరియు శ్రేయోభిలాషుల చేతుల మీదుగా విద్యార్థులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. అలాగే అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల ఉత్సాహభరితమైన ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో రేవుపోలవరం జెడ్పీహెచ్‌ఎస్‌లో స్వాతంత్ర్య వేడుకలు సందడిగా, దేశభక్తి భావాన్ని చాటుతూ ఘనంగా ముగిశాయి.

అనకాపల్లి

జాతీయ పతాకంతో ఏటికొప్పాకలో స్వాతంత్ర్య వేడుకల సందడి…!

యలమంచిలి, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాద్‌రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించారు. అనంతరం గ్రామంలోని డైలీ మార్కెట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంట్రకోట చిరంజీవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతంతో దేశభక్తి భావాలను చాటారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు. దేశ అభివృద్ధితో పాటు గ్రామ ప్రగతికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత, ప్రజలు దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు అన్నం బాబ్జి, కాంట్రకోట చిరంజీవి, భజంత్రీల రాము, అన్నం స్వరాజీరావు, నాగిరెడ్డి అచ్చయ్యనాయుడు, వైస్‌ ప్రెసిడెంట్ సింహాచలం, గొంతుమూర్తి కొండయ్యనాయుడు, శెన్నాంశెట్టి శ్రీను, భజంత్రీలు శ్రీను, అగ్రహారపు కుమార్‌స్వామి, దారా పోలిశెట్టి, రాయి కృష్ణ, నాయుడు మాస్టర్, వెంకి నాయుడు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అనకాపల్లి

ఏటికొప్పాక ఎంపీయూపీ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు..!

యలమంచిలి, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు జగన్నాథరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దేశ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు వివిధ ఆటలు, క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. Uploaded Video:

అనకాపల్లి

దేశభక్తి స్ఫూర్తితో జడ్పీహెచ్‌ పాఠశాలలో స్వాతంత్ర్య వేడుకలు…!

యలమంచిలి, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలోని జడ్పీహెచ్‌ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు రమణమూర్తి, స్కూల్ చైర్మన్ ఊడి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ ఊడి రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ విశిష్టత, దేశ చరిత్ర, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల గురించి వివరించారు. వివిధ క్రీడలు, ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు, సృజనాత్మకత, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. దేశం పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత కలిగి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

యలమంచిలి, ఆగస్టు 14 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): దేశభక్తి నినాదాలతో ఏటికొప్పాక గ్రామం మార్మోగింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఏటికొప్పాకలో శుక్రవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా గ్రామం మొత్తం కొనసాగింది. జాతీయ జెండాలను చేతబూనిన పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కుమార్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి శ్రీను, లావేటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు, ప్రజలు జాతీయ జెండాలతో ముందుకు సాగుతూ దేశ ఐక్యత, సమైక్యతను చాటారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని పెంపొందించాలనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలో ఎటుచూసినా త్రివర్ణ పతాకాలు కనిపించడంతో ఏటికొప్పాకలో దేశభక్తి వాతావరణం నెలకొంది. జైహింద్‌ నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది.

అనకాపల్లి

ఎస్సీ కాలనీ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు? డ్రైనేజీతో పాటు మంచినీటి కష్టాలు

యలమంచిలి, ఆగస్టు 14 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామానికి చివరన ఉన్న ఎస్సీ కాలనీలో సమస్యలు పేరుకుపోయాయి. కాలనీ వైపు ప్రధాన డ్రైనేజీ కాలువ చెత్తాచెదారం, మురుగుతో నిండిపోయి దుర్గంధభరితంగా మారింది. మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు, ఈగల బెడద పెరిగి కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో మంచినీటి ట్యాంక్ ఉన్నప్పటికీ సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి నీరు వస్తే మరోసారి రావడం లేదని, దీంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. డ్రైనేజీ, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రహదారులు తదితర సమస్యలను అధికారులు స్వయంగా గుర్తించి పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ప్రతిసారి ప్రజలు సమస్య చెప్పే వరకు వేచి చూడకుండా, కాలనీపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారాలు చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామానికి చివరన ఉన్నామనే కారణంతో తమ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

అనకాపల్లి

ఏటికొప్పాక జగనన్న కాలనీపై నిర్లక్ష్యం.. “మా సమస్యలూ పట్టించుకోండి

అనకాపల్లి జిల్లా, (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామం చివర కొండ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో సుమారు 170 ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు తాము ఏటికొప్పాక గ్రామానికి చెందినవారమేనని, తమ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని కోరుతున్నారు. కాలనీలో మంచినీటి ట్యాపులు ఉన్నప్పటికీ తాగునీరు సక్రమంగా రావడం లేదని, దీంతో మంచినీటి కోసం సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు లేక వర్షాకాలంలో, రాత్రివేళల్లో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా కాలనీ నుంచి ప్రధాన రహదారి వరకు పొలాల మధ్యగా వెళ్లే మార్గంలో వీధి దీపాలు లేక రాత్రివేళల్లో భయాందోళనగా ఉంటోందని పేర్కొన్నారు. ఉపాధి, ఉద్యోగాల కోసం కంపెనీలకు వెళ్లే కాలనీ వాసులు ప్రధాన రహదారి వద్ద బస్సులు, ఆటోల కోసం వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. అక్కడ బస్సు షెల్టర్ లేకపోవడంతో ఎండైనా, వర్షమైనా నిలబడేందుకు కనీస వసతి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మేమూ ఏటికొప్పాక గ్రామానికి చెందినవారమే.. మా సమస్యలను కూడా పట్టించుకోండి” అంటూ కాలనీ వాసులు అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. కాలనీకి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, ప్రధాన రహదారి వద్ద బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. Uploaded Video:

అనకాపల్లి

ఏటికొప్పాకకు అంతర్జాతీయ గుర్తింపు.. పర్యాటక గ్రామం కోసం భూసేకరణపై కసరత్తు

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 12 (పున్నమి న్యూస్ ప్రతినిధి): యలమంచిలి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం జడ్పీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటికొప్పాక లక్కబొమ్మలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. ఏటికొప్పాకను ప్రత్యేక పర్యాటక గ్రామంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్, IASతో కలిసి ఏటికొప్పాక గ్రామాన్ని పరిశీలించి, పర్యాటక ప్రాజెక్టుకు అవసరమైన స్థలాలు, భూసేకరణ అవకాశాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. సుమారు రూ.6–7 కోట్ల అంచనా వ్యయంతో షాపింగ్ ప్రాంగణాలు, భోజనశాలలు, కళల శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంకుడు కర్రల కొరత నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే వెల్లడించారు. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.