Sunday, 27 September 2026

Tag: పోలీస్

ఖమ్మం

ప్రశాంత గణేష్ ఉత్సవాలే లక్ష్యం.. పోలీసులకు సహకరించాలి: ఏసీపీ వసుంధర యాదవ్

సత్తుపల్లి / ఖమ్మం గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ సూచించారు. సత్తుపల్లిలోని ఏసీపీ కార్యాలయంలో గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల అవగాహన పోస్టర్లు, పాయింట్ బుక్స్‌ను నిర్వాహకులకు అందజేశారు. మండపాల వివరాలను పోలీసు శాఖ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, విద్యుత్ వైరింగ్‌ను నిపుణులతో తనిఖీ చేయించాలన్నారు. అగ్నిమాపక పరికరాలు, అత్యవసర మార్గాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రద్దీ, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు చేసుకోవాలని, డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల విషయంలో నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ఊరేగింపు, నిమజ్జనం సమయంలో పోలీసులతో సమన్వయం చేసుకోవాలని, చిన్నారులు, ఈత రాని వారు నీటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ వసుంధర యాదవ్ కోరారు.

ఖమ్మం

అనుమానమే హత్యకు దారితీసిందా? భార్యను గొంతు నులిమిన భర్త ఖమ్మంలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త

అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను భర్త గొంతు నులిమి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేణుకను ఆమె భర్త విద్యాసాగర్ కారులో తీసుకెళ్తుండగా రఘునాథపాలెం సమీపంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో కారులోనే రేణుకను హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఇల్లెందులోని బంధువులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని విద్యాసాగర్ చెప్పినట్లు సమాచారం. ప్రగతి స్కూల్ సమీపంలో కారును నిలిపిన విద్యాసాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విద్యాసాగర్‌కు ఇది రెండో వివాహం కాగా, రేణుకతో నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఖమ్మం

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి మండపాల నిర్వాహకులతో సమన్వయ సమావేశంలో సీపీ సునీల్ దత్

గణేష్ నవరాత్రుల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఖమ్మం నగరంలోని సూర్య తేజ ఫంక్షన్ హాల్‌లో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసు అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో పాటించాల్సిన భద్రతా నిబంధనలు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మున్నేరు నదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయ నిమజ్జన ఏర్పాటుగా ఖమ్మం అర్బన్ మండలంలోని దంసలాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరు చెరువును వినియోగిస్తున్నట్లు సీపీ తెలిపారు. మట్టి విగ్రహాల ప్రతిష్ఠాపనకు సహకరించాలని కోరారు. మండపాల నిర్వాహకులు policeportal.tspolice.gov.inలో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, విద్యుత్ వైరింగ్‌ను నిపుణులతో తనిఖీ చేయించాలని, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రద్దీ, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. డీజేలు, సౌండ్ సిస్టమ్ వినియోగంలో నిబంధనలు పాటించాలని, ఊరేగింపులు, నిమజ్జన సమయంలో నిర్ణయించిన మార్గాలు, సమయాలను తప్పక పాటించాలని సునీల్ దత్ సూచించారు.

ఖమ్మం

కల్లూరు పీఎస్‌లో సీపీ సునీల్ దత్ తనిఖీ

కల్లూరు / ఖమ్మం నేరాల నియంత్రణతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. బుధవారం కల్లూరు పోలీస్ స్టేషన్‌ను ఆయన సమగ్రంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణ చర్యలు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్ కేసులను నిర్దేశిత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి, నేరస్తులకు శిక్ష పడేలా పటిష్టమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. మహిళలు, బాలలపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై నిఘా ఉంచాలని, రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలు, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. ప్రజలకు మరింత చేరువగా పనిచేస్తూ శాంతిభద్రతలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పాల్గొన్నారు.

ఖమ్మం

బుల్లెట్లకు ‘సౌండ్’ కట్.. 400 సైలెన్సర్ల ధ్వంసం రోడ్డు రోలర్‌తో తొక్కించిన ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు

శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బుల్లెట్ ద్విచక్ర వాహనాలపై ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన అధిక శబ్దం వచ్చే 400 సైలెన్సర్లను పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ రామానుజం మాట్లాడుతూ వాహనదారులు కంపెనీ నిర్దేశించిన ఒరిజినల్ సైలెన్సర్లనే వినియోగించాలని సూచించారు. అధిక శబ్దంతో వాహనాలు నడిపినా, నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు మార్చినా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. గతంలో 1,654 బుల్లెట్ సైలెన్సర్లను తొలగించి ధ్వంసం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, అప్పలనాయుడు పాల్గొన్నారు.

ఖమ్మం

గణేష్ మండపాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: సిపీ సునీల్ దత్

ఖమ్మం: గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే మండపాల వివరాలను నిర్వాహకులు ముందుగానే తెలంగాణ పోలీస్ అధికారిక పోర్టల్ policeportal.tspolice.gov.inలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. మండప నిర్వాహకులు, కమిటీ సభ్యులు, మండప ప్రాంతం, నిమజ్జన వాహనాలు తదితర వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. 2026 గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపునకు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉందన్నారు. మండపాల వివరాలు ముందుగానే అందుబాటులో ఉండటంతో ప్రాంతాల వారీగా పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన మార్గాలు, భద్రతా చర్యలను సమర్థవంతంగా ప్రణాళిక చేయవచ్చన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

ఖమ్మం

పెనుబల్లిలో బోల్తా పడిన భారీ కంటైనర్

విజయవాడ–జగ్దల్‌పూర్ జాతీయ రహదారిపై తెలంగాణ ప్రారంభ మండలమైన పెనుబల్లి మండలం వంగా ముత్యాల బంజర్ రింగ్ సెంటర్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ కంటైనర్ బోల్తా పడింది. ప్రమాదంలో కంటైనర్ రోడ్డుపై పడిపోవడంతో వాహనదారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

ఖమ్మం

నెహ్రూ నగర్‌లో గంజాయి కలకలం.. యువకుడి అరెస్ట్

నగరము లోని నెహ్రూ నగర్‌లో గంజాయి రవాణా చేస్తున్న ఓ యువకుడిని ఖమ్మం టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించి పోలీసులను చూసి పారిపోతున్న జాహిర్‌పురకు చెందిన ఓ యువకుడిని పోలీసులు పట్టుకున్నట్లు టూ టౌన్ ఎస్‌ఐ రమేష్ తెలిపారు. అతడిని తనిఖీ చేయగా రూ.19 వేల విలువైన 380 గ్రాముల గంజాయితో పాటు ఒక సెల్‌ఫోన్ లభించినట్లు చెప్పారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్ వెల్లడించారు. యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.

ఖమ్మం

తల్వార్ విన్యాసాలు వైరల్.. ముగ్గురిపై కేసులు పుట్టినరోజు వేడుకల్లో ఆయుధాల ప్రదర్శన చేస్తే కఠిన చర్యలు: ఖమ్మం టూ టౌన్ ఎస్సై రమేష్

పుట్టినరోజు వేడుకల పేరుతో తల్వార్‌లు, కత్తులు వంటి ఆయుధాలతో విన్యాసాలు చేస్తూ వాటిని వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ముగ్గురిపై ఖమ్మం టూ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు టూ టౌన్ ఎస్సై రమేష్ తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను పోలీసు సోషల్ మీడియా బృందం పరిశీలించి, నగరానికి చెందిన షేక్ ఖాదర్, సయ్యద్ సమీర్, ఖమ్మం రూరల్ మండలానికి చెందిన షేక్ సమీర్లను గుర్తించినట్లు చెప్పారు. వీరిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాల ప్రదర్శన, ప్రమాదకర విన్యాసాలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను ఏమాత్రం సహించబోమని ఎస్సై రమేష్ హెచ్చరించారు. పుట్టినరోజు వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. రోడ్లపై ఇతరులకు ఇబ్బంది కలిగించేలా వేడుకలు నిర్వహించడం, ఆయుధాలతో విన్యాసాలు చేయడం, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దన్నారు. వైరల్ వీడియోల ఆధారంగా కూడా విచారణ జరిపి బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఖమ్మం

కంటైనర్ ఢీకొని యువకుడి దుర్మరణం

పెనుబల్లి / ఖమ్మం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైరా మున్సిపాలిటీ 1వ వార్డు బీసీ కాలనీకి చెందిన కడారి రాకేష్ మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాకేష్‌ను కంటైనర్ ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. ప్రమాదంలో రాకేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వంగా ముత్యాలబంజర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.