గణేష్ నవరాత్రుల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఖమ్మం నగరంలోని సూర్య తేజ ఫంక్షన్ హాల్‌లో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసు అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో పాటించాల్సిన భద్రతా నిబంధనలు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
మున్నేరు నదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయ నిమజ్జన ఏర్పాటుగా ఖమ్మం అర్బన్ మండలంలోని దంసలాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరు చెరువును వినియోగిస్తున్నట్లు సీపీ తెలిపారు. మట్టి విగ్రహాల ప్రతిష్ఠాపనకు సహకరించాలని కోరారు. మండపాల నిర్వాహకులు policeportal.tspolice.gov.inలో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, విద్యుత్ వైరింగ్‌ను నిపుణులతో తనిఖీ చేయించాలని, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రద్దీ, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. డీజేలు, సౌండ్ సిస్టమ్ వినియోగంలో నిబంధనలు పాటించాలని, ఊరేగింపులు, నిమజ్జన సమయంలో నిర్ణయించిన మార్గాలు, సమయాలను తప్పక పాటించాలని సునీల్ దత్ సూచించారు.



